హైదరాబాద్ : మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాతో పాటు హైదరాబాద్ జిల్లా పరిధిలోని కంటోన్మెంట్‌లో ఉన్న ప్రభుత్వ భూముల ఆక్రమణలను మాత్రమే తొలగించడం జరిగిందని స్పష్టం చేసింది హైడ్రా. ఇందులో ప్రైవేటు పట్టాలు ఏమీ లేవని స్పష్టం చేసింది. కంటోన్మెంట్ పరిధిలోని రాష్ట్ర ప్రభుత్వ భూములుగా హైడ్రా పేర్కొంది. ఈ భూముల ఆక్రమణలు తొలగించడంపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని హైడ్రా ఖండించింది. శాంతాశ్రీరాం బిల్డర్స్‌కు చెందిన భూమి లోతుకుంటలోని సర్వే నంబరు 1, 2లలో ఉంటే.. హైడ్రా కాపాడిన భూమి కంటోన్మెంట్ పరిధిలోని జీఎల్ ఆర్ నంబరు 243లో 119 ఎకరాలు, 255లో 29 ఎకరాలకు పైగా ఉన్న భూమి ప్రభుత్వానికి సంబంధించినదని స్పష్టం చేసింది. లోతుకుంటలోని సర్వే నంబరు 1, 2లోని శాంతాశ్రీరాం బిల్డర్స్ లే ఔట్‌కు ప్రస్తుతం హైడ్రా కాపాడిన ప్రభుత్వ భూమికి మధ్య దూరం దాదాపు 3 కిలోమీటర్ల వరకూ ఉందని హైడ్రా పేర్కొంది. సర్వే నంబర్ 1, 2 కు సంబంధించి ప్రైవేట్ భూమిపై ఉన్న కోర్టు ఉత్తర్వులకు GLR నంబర్ 243, 255కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
కంటోన్మెంట్ ప్రాంతంలో గల జీఎల్ ఆర్( జనరల్ ల్యాండ్ రిజిస్టర్) నంబరు 243, 255లలో ఉన్న 148 ఎకరాల ప్రభుత్వ భూమిలో సహజసిద్ధమైన కొండలు, అడవిని తలపించేలా చెట్లున్నాయి. వీటిలో ఎంతో స్వేచ్ఛగా తిరిగే నెమళ్లు, కుందేళ్లు అ పరిసర ప్రాంతాల వారికి సుపరిచితమే. అక్కడి కొండలను రాత్రి పూట పేల్చుతున్నారని.. భారీ శబ్దాలు అక్కడ వణ్యప్రాణుకు హానిగా పరిణమించాయని పర్యావరణ వేత్తలు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా మైనింగ్‌కు పాల్పడుతున్నారని అక్కడి రాక్ సొసైటీవాళ్లు కూడా హైడ్రాను ఆశ్రయించారు. కొండల్ని పేల్చేసి లే ఔట్‌గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఇప్పటికే కొంత భూమి అన్యాక్రాంతమైందని.. మొత్తం ప్రభుత్వ భూమిని కాపాడాలని అక్కడి స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత జీఎల్ ఆర్ నంబర్ 243, 255లోని ప్రభుత్వ భూములను కాపాడుతూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. ఇలా 10 వేల కోట్ల రూపాయల ప్రభుత్వ, ప్రజల ఆస్తిని కాపాడినట్టయింది.
