చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో నటుల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోందా. అవుననే సమాధానం వస్తోంది. ఇప్పటి వరకు పలువురు నటులు రాజకీయాలలో ప్రవేశించారు. మరికొందరు అందులో సక్సెస్ కాలేక పోయారు. కానీ తాజాగా దళపతి విజయ్ మాత్రం ఎవరూ ఊహించని రీతిలో కేవలం 2 సంవత్సరాలలోనే టీవీకే పార్టీని స్థాపించడమే కాదు ఏకంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అందరినీ విస్తు పోయేలా చేశాడు. దీంతో మిగతా నటులు కూడా దళపతి దారినే ఎంచుకుంటున్నారు. విజయ్ తొలుత తన ఫ్యాన్స్ సంఘాల ద్వారా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా లేదా ఏ సహాయం కావాలన్నా తక్షణమే అందించాడు. దీంతో తనపై పాజిటివ్ దృక్ఫథం ఏర్పడింది. ప్రజలు ఆయనను నమ్మారు. భారీ విజయాన్ని కట్టబెట్టారు. ఇదే క్రమంలో నటుడు శివ కార్తికేయన్ కూడా ఫ్యాన్స్ క్లబ్ లో పాల్గొన్నాడు. ఆయనతో పాటు మరో అగ్ర నటుడు ధనుష్ కూడా రాజకీయాల్లోకి వస్తారని బలంగా ప్రచారం జరుగుతోంది.
తాజాగా ధనుష్ ఫ్యాన్ క్లబ్ పేరు మార్పుతో తమిళనాడు రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. తను రాజకీయాల్లోకి ప్రవేశించ వచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆయన తన అభిమాన సంఘానికి పేరు మార్చడం, అందులోని మహిళా సభ్యులతో భారీ సమావేశం నిర్వహించడం దీనికి కారణమైంది. ఈ పరిణామంపై వివిధ రాజకీయ పార్టీలు స్పందించాయి. అధికార తమిళగ వెట్రి కళగం ధనుష్ వల్ల తమకు ఎలాంటి రాజకీయ ముప్పు లేదని కొట్టిపారేయగా, కాంగ్రెస్ పార్టీ దీని వెనుక బీజేపీ-ఆర్ఎస్ఎస్ వ్యూహం ఉండవచ్చని ఆరోపించింది. గతంలో ‘ధనుష్ నర్పని మండ్రం’ ఉన్న ఆయన సేవా సంస్థ, ఇప్పుడు ‘ధనుష్ నర్పని ఇయక్కం’ గా పేరు మార్చబడింది. తొరైపాక్కంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో జరిగిన ఈ సంస్థ సమావేశానికి సుమారు 3,000 మంది సభ్యులు హాజరైనట్లు సమాచారం. మహిళా విభాగం సభ్యులతో ధనుష్ సుమారు నాలుగు గంటల పాటు గడిపారు. వారితో సంభాషించడం, ఫోటోలకు పోజులివ్వడం, తన సినిమాల్లోని పాటలను పాడటం వంటివి చేశారు.
అనంతరం ఆయన బృందం ఈ కార్యక్రమానికి సంబంధించిన 49 సెకన్ల వీడియోను విడుదల చేసింది. వేదికపై ఉన్న బ్యాక్డ్రాప్లో ధనుష్ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. అంతే కాకుండా రాజకీయ నాయకులు ప్రజలకు అభివాదం చేసే తరహాలో చేతులు ఊపడం, చేతులు జోడించి నమస్కరించడం వంటి భంగిమల్లో ఆయన చిత్రాలు ఉన్నాయి. ఈ దృశ్యాలు సంస్థ పేరు మార్పు వంటి అంశాలు ఆయన రాజకీయ ఆశయాల గురించి ఊహాగానాలకు దారితీశాయి. సమావేశానికి హాజరైన వారికి వెండితో చేసిన సాంప్రదాయ ‘కామాక్షి దీపాలు’ బహుకరించారు. వీటిపై తామర పువ్వు గుర్తు ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే, రాజకీయాల్లోకి ప్రవేశించే విషయంపై ధనుష్ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కార్యక్రమం ముగించుకుని బయటకు వస్తున్నప్పుడు, రాజకీయాల్లోకి రానున్నారా అని విలేకరులు అడగగా, ఆయన నేరుగా సమాధానం చెప్పకుండా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి వెళ్లిపోయారు.



















