తిరుపతి : ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సౌర విద్యుత్తు వ్యవస్థ ఏర్పాటు పనుల్ని ఈ నెలాఖర్లోగా పూర్తి చేయాలని ఎపిఎస్పిడిసిఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివ శంకర్ లోతేటి స్పష్టం చేశారు. రూప్ టాప్ సోలార్ పనులపై సిఎండి సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎండి మాట్లాడుతూ ఎపిఎస్పిడిసిఎల్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారుల గృహాలపై 2.07 లక్షల రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ కుగానూ ప్రస్తుతం 2 లక్షల సోలార్ వ్యవస్థల ఏర్పాటు పనులను పూర్తి చేశామన్నారు. మిలిగిన 7 వేల సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఎపిఎస్పిడిసిఎల్ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో 415 మెగావాట్ల సామర్థ్యంతో 2.07 లక్షల ఎస్సీ,ఎస్టీ వినియోగదారుల గృహాలపై రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటు పనులు చివరి దశకు చేరుకున్నాయని వివరించారు. ఈ పనుల్లో భాగంగా ప్రస్తుతం నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఇ) పోర్టల్ యుటిలిటీ లెడ్ ఆగ్రిగేషన్ (యుఎల్ఎ) అధికారిక గణాంకాల మేరకు 2.88 మెగావాట్ల సామర్థ్యంతో 1.44 లక్షల గృహాలపై సోలార్ వ్యవస్థలను గ్రిడ్ కు అనుసంధాన పనులు పూర్తయ్యాయని తెలిపారు శివశంకర్ లోతేటి. ఈ నెలాఖర్లోగా మిగిలిన సర్వీసులకు కూడా గ్రిడ్ అనుసంధాన పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీల గృహాలపై రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు గతంలో సాంకేతికంగా అవకాశం లేని వినియోగదారుల గృహాలను పునః పరిశీలించాలని సూచించారు సీఎండీ. ప్రస్తుతం ఆర్హత వున్నట్లయితే మరో 50వేల గృహాలపై కూడా రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అర్హత కలిగిన గృహాలపై సోలార్ వ్యవస్థల ఏర్పాటు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ – ఐటి, ఫైనాన్స్/ఎఫ్ఎసి) పి. అయూబ్ ఖాన్, డైరెక్టర్(టెక్నికల్) కె.గురవయ్య, చీఫ్ జనరల్ మేనేజర్ ఎన్. శోభా వాలెంటీనా, ఓఎస్డి పి. ఉమాపతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

















