అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల కీలక వ్యాఖ్యలు చేశారు. తనను నమ్మి గెలిపించిన పిఠాపురం నియోజకవర్గానికి భారీ ఎత్తున నిధులను తీసుకు వచ్చానని చెప్పారు. గత ఏడాది రూ. 308 కోట్లతో అభివృద్ది పనులు చేపడితే ఈ ఏడాది రూ. 211 కోట్లతో మరిన్ని పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేసి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు అన్నారు. నన్ను బలోపేతం చేస్తే మరింతగా పని చేస్తా. అధికారం ఉన్నా లేకపోయినా ఆఖరి శ్వాస వరకు ఇక్కడి ప్రజల కోసం పని చేస్తాననని ప్రకటించారు పవన్ కళ్యాణ్. నాయకుడు అవసరం లేని వ్యవస్థను నిర్మించడమే నిజమైన అభివృద్ధి అన్నారు. అలాంటి అభివృద్ధి కోసమే మేమంతా శ్రమిస్తున్నాం అని చెప్పారు.
పిఠాపురంలో ఏ చిన్న సంఘటన జరిగినా దానిని వైరల్ చేస్తున్నారంటూ వాపోయారు పవన్ కళ్యాణ్. పిఠాపురంలో చెట్టు మీద ఆకు ఊగినా, పక్షి ఈక రాలినా ఏదో జరిగి పోయిందని ప్రచారం చేస్తున్నారు. పులివెందులలో సొంత బాబాయ్‌ని చంపినా అది వార్త కాదు.. పిఠాపురంలో స్కూల్ పిల్లలు కొట్టుకున్నా అది పెద్ద వార్త అవుతుందని అన్నారు. ఎంతో విజ్ఞత ఉన్న రాజకీయ నాయకులే మాటకు మాట అనుకుంటున్న రోజులివి. అలాంటిది చిన్న పిల్లలు ఒక మాట అనుకోరా? దానికి కులాలను మధ్యలోకి తీసుకు రావాలా? గత ప్రభుత్వానికి తెలిసింది ఒక్కటే… బూతులు తిట్టడం, కేసులు పెట్టడం, ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేయడం. ఇప్పుడు అదే పద్ధతిని అవలంబిస్తున్నారని వాపోయారు పవన్ కళ్యాణ్. పిఠాపురం వచ్చి గొడవలు చేద్దాం.. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడదాం అనుకుంటే ఇక్కడే కూర్చొని ఏరివేస్తాను.















