హైదరాబాద్ : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసే లక్ష్యంతో వచ్చే రెండు దశాబ్దాల ప్రగతిని దృష్టిలో పెట్టుకొని ‘తెలంగాణ రైజింగ్–2047’ పాలసీ డాక్యుమెంట్‌ను సిద్ధం చేశామని వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక, సామాజిక, పట్టణాభివృద్ధి, విద్య, పరిశ్రమల రంగాల్లో వచ్చే 20 సంవత్సరాల ప్రణాళికలు ఈ డాక్యుమెంట్‌లో ఉంటాయన్నారు.
డిసెంబర్ 6 వరకు ఉమ్మడి జిల్లాల్లో ‘తెలంగాణ రైజింగ్–2047 సమ్మిట్ ఉత్సవాలు’ నిర్వహిస్తున్నామని తెలిపారు. 7న ఉస్మానియా యూనివర్సిటీలో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. 8,9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నామన్నారు. 9న రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి దిశను ప్రతిబింబించే Vision 2047 డాక్యుమెంటరీని విడుదల చేస్తామని ప్రకటించారు. సమ్మిట్ స్టాల్స్‌ను ప్రజలు డిసెంబర్ 11, 12, 13 తేదీల్లో సందర్శించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
ప్రపంచ దృష్టిలో తెలంగాణను నిలబెట్టే ప్రయత్నంగా, అంతర్జాతీయ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని హైదరాబాద్‌కు ఆహ్వానించామని చెప్పారు డిప్యూటీ సీఎం. డిసెంబర్ 13న ఉప్పల్ స్టేడియంలో ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. తెలంగాణను మూడు రీజియన్లుగా విభజించి సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేశామన్నారు మల్లు భట్టి విక్రమార్క. తెలంగాణను “CURE–PURE–RARE” మోడల్‌తో 2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి త్రీ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రకటించారు. చైనా, జపాన్, సింగపూర్, సౌత్ కొరియా వంటి అభివృద్ధి చెందిన దేశాలను ఆదర్శంగా తీసుకుని తెలంగాణను అభివృద్ధి చేస్తామన్నారు.















