హైదరాబాద్ : తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. తమ ప్రజా ప్రభుత్వం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పై ఎక్కువగా దృష్టి సారించామని చెప్పారు. అంతే కాకుండా
హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి మహానగరంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు. ఈ దిశగా గత రెండు సంవత్సరాల్లోనే రికార్డు స్థాయిలో రూ. 20,000 కోట్లను నగర అభివృద్ధికి కేటాయించడం జరిగిందని చెప్పారు డిప్యూటీ సీఎం. రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ మొత్తంలో నిధులు కేటాయించడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు.
హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడం జరిగిందన్నారు. దీని ద్వారా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో సమగ్ర ప్రణాళికతో కూడిన సమతుల్య అభివృద్ధి సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు మల్లు భట్టి విక్రమార్క. హెచ్-సిటి (H-CITI) ప్రోగ్రాం ద్వారా రూ. 7,032 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు , రహదారుల విస్తరణ పనులను వేగవంతం చేశామన్నారు.తెలంగాణ రైజింగ్ విజన్ 2047లో భాగంగా కేవలం మౌలిక సదుపాయాలనే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, మెరుగైన జీవన ప్రమాణాలకు పెద్దపీట వేస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డ నాయకత్వంలో హైదరాబాద్‌ను పెట్టుబడులకు స్వర్గధామంగా, అత్యంత నివసించ దగిన నగరంగా తీర్చిదిద్దుతున్నామని ప్రకటించారు డిప్యూటీ సీఎం.

















