తిరుపతి జిల్లా : వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించి సంచలన ప్రకటన చేశారు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బా రాయుడు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు డిప్ ద్వారా టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే తిరుమలలో ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. ఇతరులు ఎవరైనా సరే వచ్చినా ఇబ్బంది పడక తప్పదన్నారు. ఈనెల 30న మంగళవారం వైకుంఠ ఏకాదశి, ద్వాదసి 8వ తేదీ పర్వదినాలను పురస్కరించుకుని తిరుమలలో భారీ ఎత్తున భద్రత ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు ఎస్పీ. 2 వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తారని తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనం మొత్తం 10 రోజులు ఉంటుందన్నారు. అయితే రద్దీని పురస్కరించుకుని టీటీడీ ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీలలో టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనం ఉంటుందని స్పష్టం చేశారు ఎస్పీ.
ఆన్లైన్ ద్వారా సుమారు 25 లక్షల మంది భక్తులు అప్లై చేయగా, ఒక్కో రోజుకు 60,000 టోకెన్లు చొప్పున దర్శనాలు కేటాయించడం జరిగిందన్నారు. తిరుమల, తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్న అనుబంధ ఆలయాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టామన్నారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా ట్రాఫిక్ నియంత్రణ, క్యూలైన్ నిర్వహణ, నిఘా చర్యలు తీసుకున్నామని తెలిపారు సుబ్బారాయుడు. టీటీడీ అధికారులతో సమన్వయం చేసుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా విధులు నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. భక్తులు క్రమశిక్షణతో, సౌమ్యంగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
