అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ సంస్థ (ఐఎండీ) హెచ్చరించింది. ఇప్పటికే పలు తుపాన్లు ఏపీని అట్టుడికేలా చేశాయి. దీంతో ప్రజలు ముఖ్యంగా రైతులు తీవ్రంగా నష్ట పోయారు. భారీ ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. ఇదిలా ఉండగా తాజాగా మరో కీలక ప్రకటన చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. ఆగ్నేయకు ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిందని తెలిపారు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ , ఆర్డీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్. గడిచిన 6 గంటల్లో 8 కిమీ వేగంతో కదిలిందని తెలిపారు. ప్రస్తుతం చెన్నైకు 720 కి.మీ., విశాఖపట్నంకు 820 కి.మీ.,గోపాల్పూర్ కు 940 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు.
దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సాయంత్రానికి తుపానుగా బలపడే అవకాశం ఉందని హెచ్చరించారు. నవంబర్ 17 న మంగళవవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు . అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆ తదుపరి 48 గంటల్లో అతి తీవ్ర తుపాన్ గా కోస్తాంధ్ర తీర ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందన్నారు ఎండీ. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని సూచించారు ప్రఖర్ జైన్ . దీని ప్రభావంతో కోస్తాంధ్రలో గురు, శుక్రవారాల్లో ఈదురు గాలులతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. సాయంత్రం నుంచి కోస్తా తీరం వెంబడి గంటకు 40-60కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

















