హైదరాబాద్ : హైదరాబాద్ బస్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టిజీఎస్ఆర్టీసీ) వైస్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ గా సోమవారం బాధ్యతలు చేపట్టారు సీనియర్ పోలీస్ అధికారి అనిల్ కుమార్. తాజాగా తెలంగాణ సర్కార్ పలువురు సీనియర్ పోలీస్ అధికారులను బదిలీ చేసింది. ఇందులో భాగంగా ఇప్పటి వరు ఆర్టీసీ ఎండీ, వైస్ చైర్మన్ గా ఉన్న నాగి రెడ్డిని తప్పించింది. ఆయన స్థానంలో అనిల్ కుమార్ కు ఛాన్స్ ఇచ్చింది. దాదాపు మూడు దశాబ్దాల పోలీస్ సర్వీసులో వివిధ కీలక బాధ్యతలు నిర్వహించారు డాక్టర్ అనిల్ కుమార్. ఆయన స్వస్థలం హిమాచల్ ప్రదేశ్. 1996 ఐపీఎస్ కేడర్ కు చెందిన అధికారి. పోలీస్ శాఖలో అంతర్గత భద్రత, ఆపరేషన్స్ , పరిపాలన విభాగాలలో కీలక పదవులు చేపట్టారు. మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు.
ప్రధానంగా తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ,గ్రేహౌండ్స్. ఆక్టోపస్ లలో పని చేశారు. ప్రత్యేకించి మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణ, అంతర్గత భద్రతకు సంబంధించిన విధుల్లో అనిల్ కుమార్ కీలక పాత్ర పోషించారు. రాష్ట్రంలో నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాలకు గ్రేహౌండ్స్ ప్రత్యేక దళం ఎంతో కీలకం. అనిల్ కుమార్ ఈ విభాగానికి సంబంధించిన ఆపరేషన్స్‌లో ఉన్నతాధికారిగా వ్యవహరించారు. ఆక్టోపస్ ప్రత్యేక విభాగం కూడా తీవ్రవాద వ్యతిరేక చర్యలు, ప్రత్యేక భద్రతా కార్యకలాపాల్లో కీలకమైనది. పోలీస్ శాఖా పరంగా విశిష్టమైన సేవలు అందించినందుకు గాను ఆయన పలు పతకాలు అందుకున్నారు. 2013లో ఇండియన్ పోలీస్ మెడల్ , 2020లో పోలీస్ సర్వీస్ మెడల్ , 2023లో విశిష్టమైన రాష్ట్రపతి పోలీస్ పతకం అందుకున్నారు అనిల్ కుమార్. తాజాగా కీలకమైన ఆర్టీసీ సంస్థలో చేరారు.

















