అమరావతి : ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యలు లేని నాణ్యమైన విద్యుత్ నిరంతరాయ సరఫరా కోసం సుమారు రూ. 6 వేల కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు ఇంధన, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఆయన బీమవరంలో పర్యటించారు. పీఎం సూర్య ఘర్ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల సబ్సిడీ సోలార్ విద్యుత్ కనెక్షన్లు మంజూరైనట్లు తెలిపారు మంత్రి. వాటిలో 6 లక్షల కనెక్షన్లను ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. పశ్చిమ గోదావరిలో సూర్యఘర్ అమలుకు రూ.257 కోట్లకు పైగా వ్యయం చేసినట్లు వెల్లడించారు.
కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి అనే రెండు చక్రాలపై రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తోందని ఇంధనశాఖ మంత్రి తెలిపారు. మారుమూల ప్రాంతాల్లోనూ గుంతల రహిత రహదారులు ఏర్పాటు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఎక్కడ సమస్య వచ్చినా, పరిష్కారం చూపే విధంగా ప్రభుత్వ పాలన సాగుతుందన్నారు. రహదారులు, రవాణా రంగాల అభివృద్ధికి భారీ నిధులు కేటాయించామన్నారు. గ్రామీణ రహదారులతో పాటు రాష్ట్ర, జాతీయ రహదారుల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. అదే విధంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, మహిళలు., అన్ని వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
