విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. శనివారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. అన్నదాత సుఖీభవ కాదు దుఖీఃభవ గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడో ఏడాది సైతం రైతులకు మోసం తప్పా ఒరిగింది ఏముందంటూ ప్రశ్నించారు. రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని చంద్రబాబు మొక్కుబడి చేశారని ఆరోపించారు. రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని అరకొర విధింపులతో మమ అనిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 80 లక్షల మంది అర్హత కలిగిన రైతన్నలు ఉంటే ఈ ఏడాది సైతం ఇస్తున్నది కేవలం 46.86 లక్షల మందికే ఇవ్వడం ఎంత వరకు సబబు అని నిలదీశారు. ముచ్చటగా 30 లక్షల మంది రైతులకు మళ్లీ ఎగనామం పెట్టారంటూ ధ్వజమెత్తారు. తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో సంవత్సరం రైతులకు కత్తెర వేశారంటూ భగ్గుమన్నారు. ప్రస్తుతం మూడో ఏడు పథకాన్ని నామ మాత్రం చేశారన్నారు.
సుఖీభవను సగం సగం చేశారని ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిలా రెడ్డి. పంట నష్ట పరిహారాన్ని ఎగ్గొట్టారన్నారు. మద్దతు ధరలకు మంగళం పాడారని, పంట భీమాకి ధీమా లేకుండా చేశారని ఆరోపించారు. ఎరువులు ఇవ్వకుండా రైతులను అరిగోస పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్డులు ఇస్తామని నమ్మబలికి 30 లక్షల మంది కౌలు రైతులను కకావికలం చేశారన్నారు. అండగా నిలబడడం కాదు.. వ్యవసాయాన్ని చేసింది దండుగ తప్పా మరోటి కాదన్నారు. రైతాంగాన్ని కూటమి ప్రభుత్వం మార్చింది అగమ్య గోచరంగా మార్చేశారన్నారు. అన్నదాత సుఖీభవపై చంద్రబాబు పెట్టింది మడతపేచి పెట్టారన్నారు. కేంద్రం ఇచ్చేది బోనస్ అని మాట మార్చడం రైతులకు చేసిన తీరని అన్యాయం జరిగిందన్నారు.
