అమరావతి : ప్రముఖ యోగా గురు బాబా రామ్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఆకాశానికి ఎత్తేశారు. ఆపై తనను యోగి అని అభివర్ణించారు. అంతే కాకుండా కర్మ యోగి అంటూ కితాబు ఇచ్చారు. దేశం కోసం ప్రధాని పని చేస్తున్నారని, చంద్రబాబు సహకరిస్తున్నారని పేర్కొన్నారు. శనివారం ఉండవల్లి గుహల వద్ద తన శిష్యులతో కలిసి యోగాభ్యాసం నిర్వహించారు రామ్ దేవ్ బాబా . సీఎం చంద్రబాబు చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా రామ్ దేవ్ బాబా మాట్లాడుతూ యోగా మన దేశానికి గర్వకారణం అన్నారు. సీఎం చంద్రబాబు ముఖ్య అతిధిగా రమ్మన్నారు.. కానీ యోగా అతిథిగా వచ్చాను. ఈ వయస్సులో కూడా చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారు. సీఎం చంద్రబాబు అభివృద్ధి, విజన్ కలిగిన ముఖ్యమంత్రి.
ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారంటూ ప్రశంసించారు. ఏక్ భారత్… శ్రేష్ట్ భారత్ అనే నినాదంతో ప్రధాని పని చేస్తున్నారు . దానికి చంద్రబాబు సహకరిస్తున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ కోసం కృషి చేస్తూ.. భారతదేశాన్ని విశ్వగురుగా నిలిపేందుకు ప్రధాని చేస్తున్న కృషికి చంద్రబాబు తోడయ్యారు. చంద్రబాబు తరహాలో ప్రతి ముఖ్యమంత్రి పని చేస్తే వికసిత్ భారత్ 2047 లక్ష్యం ముందుగానే సాకారం అవుతుందని చెప్పారు. ప్రజా రాజధాని అమరావతి.. ఇప్పుడు యోగ రాజధాని అయిందన్నారు రామ్ దేవ్ బాబా. రాజధానిని పచ్చదనంతో విలసిల్లేలా నిర్మిస్తున్నారు.
స్విట్జర్లాండ్ దేశంలో ఉన్నటువంటి అందాలు అమరావతిలో ఉన్నాయని అన్నారు. ఉండవల్లి గుహల్లో కొలువైన పద్మనాభ స్వామిని దర్శించుకున్నాను. ఇక్కడి అరటి, మామిడి పండ్లు చాలా రుచిగా ఉన్నాయి. ప్రకృతి వ్యవసాయాన్ని సీఎం చంద్రబాబు ప్రొత్సహిస్తున్నారు. సీఎం చంద్రబాబు ప్రకృతి ప్రేమికుడు, సాంస్కృతిక ప్రేమికుడు, యోగ ప్రేమికుడు సర్వజన ప్రేమికుడు. చంద్రబాబు యోగి, కర్మయోగి అని రామ్ దేవ్ బాబా అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
