విభ‌జ‌న రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్న కాంగ్రెస్

నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి జి. కిష‌న్ రెడ్డి

hellotellugu-GKishanReddy

హైద‌రాబాద్ : ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ జై శ్రీ‌రాం అంటార‌ని కానీ శివుడి గురించి ఓం న‌మో శివాయః అని ఎందుకు అన‌డం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి. ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి. దీనిపై తీవ్రంగా స్పందించారు బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి గంగాపురం కిష‌న్ రెడ్డి. ఆయ‌న శుక్ర‌వారం మీడియాతో మాట్లాడారు. ప్ర‌జ‌ల‌ను విభ‌జించే ప‌నిలో కాంగ్రెస్ పార్టీ ప‌డిందంటూ మండిప‌డ్డారు. ఉప ఎన్నిక‌ల్లో లబ్ది పొందేందుకే సీఎం ఇలాంటి చిల్ల‌ర వ్యాఖ్య‌లు చేశార‌న్నారు. శివుడిపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధ్యతా రహితమైనవని కేంద్ర మంత్రి విమర్శించారు. శ్రీరాముడిని, శివుడిని విభజించడానికి ప్రయత్నిస్తున్నారని మండిప‌డ్డారు. పూర్తిగా ఖండిస్తున్నామ‌ని అన్నారు. సనాతన ధర్మాన్ని, హిందూ సమాజాన్ని అవమానిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రజా నిరసనలకు దారితీసేలా ఉన్నాయ‌న్నారు.

కేవ‌లం రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం స్వాతంత్రానికి ముందు తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న పద్ధతేన‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు జి. కిష‌న్ రెడ్డి. ఇప్పుడు వాళ్లు దేవుళ్ల మధ్య కూడా విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తుండ‌డం దారుణ‌మ‌న్నారు. ప్ర‌స్తుతం దేశంలో జ‌నాద‌ర‌ణ కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ విభేదాల దారి ఎంచుకుందంటూ మండిప‌డ్డారు. ఆ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముంది? అని సీఎం ను ఉద్దేశించి ప్ర‌శ్నించారు. హిందువులు అందరు దేవుళ్లను, దేవతలను పూజిస్తారు. మీకు దేవుడిపై నమ్మకం లేకపోతే మానుకోవాల‌న్నారు. గతంలో రాహుల్ గాంధీ పార్లమెంటులో శివుడి ఫోటోను ప్రదర్శించి ఇలాంటి రాజకీయాలే ఎందుకు చేశారు అని నిల‌దీశారు. 2023లో వాగ్దానం చేసిన 6 హామీలు, 420 ఉప-హామీలను అమలు చేయకుండా, రేవంత్ రెడ్డి ప్రతిరోజూ ఒక కొత్త నాటకం ఆడుతున్నారని కిషన్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

Exit mobile version