అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. అరకును ఒక ప్రముఖ ప్రపంచ కాఫీ గమ్యస్థానంగా తీర్చిదిద్దడంపై దృష్టి సారించాలని అన్నారు. అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మందికి ఆ మొదటి అద్భుతమైన కాఫీ గుక్క లేకుండా రోజు నిజంగా ప్రారంభం కాదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చురుకుగా పెట్టుబడులు పెడుతోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గొప్ప వారసత్వపు రుచి ఇది అని పేర్కొన్నారు సీఎం. మన రాష్ట్రంలోని పచ్చని కొండల నుండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కాఫీ కప్పుల వరకు విస్తరించడం మామూలు విషయం కాదన్నారు. దీని వెనుక ఎందరో శ్రమ దాగి ఉందన్నారు. గత ప్రభుత్వం అరకు కాఫీ గురించి, దాని విశిష్టత ను పట్టించు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తాము వచ్చాక అరకు కాఫీ బ్రాండ్ ను పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నామని తెలిపారు.
దీంతో మన స్థానిక రైతులను శక్తివంతం చేస్తూ ప్రపంచ కాఫీ పటంలో ఆంధ్రప్రదేశ్ తన సముచిత స్థానాన్ని పొందేలా చూస్తున్నామని పేర్కొన్నారు నారా చంద్రబాబు నాయుడు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తూర్పు కనుమల అద్భుతమైన ప్రకృతి దృశ్యాల మధ్య పండించే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక విశిష్ట సంపద అయిన అరకు కాఫీని వేడుకగా జరుపుకోవడం నాకు గర్వంగా ఉందన్నారు. అంతకు మించి ఆనందం కలుగుతోందని తెలిపారు. . నాకు అరకు కాఫీ అంటే కేవలం దాని రుచి, సువాసన మాత్రమే కాదు. ఇది మన అడవులు, మన గిరిజన సమాజాలు , వారి సాంప్రదాయ జ్ఞానం మధ్య ఉన్న బంధానికి ప్రతీక అని అన్నారు. ఇది భూమి సారవంతాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్న ఒక గుర్తింపుగా మారుస్తోందన్నారు. అరకు లోయల నుండి న్యూఢిల్లీలోని పార్లమెంట్ వరకు, ప్రత్యేక స్టాల్స్ ద్వారా అరకు కాఫీని ప్రదర్శించిన ఈ ప్రయాణం, మన సమాజాలలో పాతుకుపోయిన ఒక స్థానిక ఉత్పత్తి భారత్ కథను విస్తృత ప్రపంచానికి ఎలా తీసుకువెళ్లగలదో ప్రతిబింబిస్తుందని తెలిపారు.
