కుంట్లూరులో ఇస్తారిబాయి కుంటకు హైడ్రా రక్షణ

కుడికుంట మిగులు భూమిని కాపాడిన హైడ్రా

hellootelugu-HYDRAA

హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండ‌లం కుంట్లూరు గ్రామంలోని ఇస్తారిబాయి కుంట‌ను హైడ్రా కాపాడింది. స‌ర్వే నంబ‌రు 248 లో 2.5 ఎక‌రాలు ప్ర‌భుత్వ భూమి కాగా ఇదే ప‌రిధిలో ఇస్తారిబాయి కుంట విస్త‌రించింది. దీనిని ఇరిగేష‌న్‌తో పాటు హెచ్ ఎం డీఏ కూడా గుర్తించింది. ఈ స‌ర్వే నంబ‌రుకు ఆనుకుని ప్రైవేట్ భూములుండ‌గా.. అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్లు వేశారు. ఈ క్ర‌మంలో చెరువులోకి జ‌రిగి కొంత ఆక్ర‌మించి నిర్మించిన ప్ర‌హ‌రీని హైడ్రా తొల‌గించింది. అలాగే చెరువులోకి జ‌రిగి లే ఔట్ వేసి ప్లాట్లుగా విక్ర‌యించేందుకు చేసే ప్ర‌య‌త్నాల‌కు కూడా హైడ్రా చెక్ పెట్టింది. చెరువు క‌ట్ట కింద ఆర్ ఎం సీ ప్లాంట్ నిర్వాహ‌కులు కార్మికుల‌కోసం చెరువు క‌ట్ట‌కు ఆనుకుని నిర్మించిన షెడ్డులు కూడా బ‌ఫ‌ర్ జోన్‌లో ఉన్నందున వాటిని హైడ్రా తొల‌గించింది. భ‌విష్య‌త్తులో ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురికాకుండా చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేసింది.

2.5 ఎక‌రాల చెరువును పూడ్చేసి మాయ చేయాల‌నుకునే వారి ప్ర‌య‌త్నాల‌కు హైడ్రా చెక్ పెట్ట‌డంతో స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. కొన్నాళ్లుంటే చెరువు మాయ‌మ‌య్యేద‌ని, ఫిర్యాదు చేసిన వెంట‌నే హైడ్రా క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించి.. వెనువెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవ‌డం అభినందించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని పేర్కొన్నారు. శేరిలింగంప‌ల్లి మండ‌లం కొండాపూర్ గ్రామంలోని కుడికుంట‌ను కూడా హైడ్రా కాపాడింది. మొత్తం చెరువు 8 ఎక‌రాలు కాగా ఇప్ప‌టికే ఈ చెరువును సొసైటీ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ హ్యూమన్ ఎండీవర్ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ చెరువుకు ఆనుకుని 300ల గ‌జాల స్థ‌లం ఉంది. ఇది చెరువు ప‌రిధిలోనిదే కాని ఇందులో నీరు లేక పోవ‌డంతో దీనిని ఆక్ర‌మించేందుకు అక్క‌డి స్థానికులు కొంత‌మంది ప్ర‌య‌త్నాలు చేస్తూ వ‌స్తున్నారు. చెరువు కింది భాగంలో ఉన్న ఈ 300ల గ‌జాల ఖాళీ స్థ‌లంలో అసాంఘిక కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని, ఈ భూమిలోకి ఎవ‌రూ వెళ్ల‌కుండా ఫెన్సింగ్ వేయాల‌ని అక్క‌డి స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించి కుడికుంట‌కు చెందిన భూమిగా నిర్ధారించుకున్నాక హైడ్రా 300ల గ‌జాల‌ను కాపాడుతూ ఫెన్సింగ్ వేసింది.

Exit mobile version