హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ రాష్ట్రంలోని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులను విచారించింది సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ ). ఇప్పటికే గతంలో కొలువు తీరిన కేసీఆర్ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పి, నానా తిప్పలు పెట్టిన ఖాకీలు ప్రభాకర్ రావు, రాధా కిషనర్ రావులను పలుమార్లు విచారించింది. ఇదే సమయంలో ఆనాడు అన్నీ తామై వ్యవహరించిన కల్వకుంట్ల కుటుంబానికి చెందిన మాజీ మంత్రులు తన్నీరు హరీశ్ రావు, కల్వకుంట్ల తారక రామారావుతో పాటు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావులను ఏడు గంటలకు పైగా విచారించింది సిట్ బృందం.
ఇదే క్రమంలో తాజాగా ఎవరూ ఊహించని రీతిలో బీఆర్ఎస్ బాస్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఆయన నివాసం ఉంటున్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి నోటీసులు అందించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీ హిల్స్ లోని తమ పోలీస్ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే వయసు రీత్యా తను ఎక్కడ కోరుకుంటే అక్కడికి వచ్చి విచారణ చేస్తామని కూడా స్పష్టం చేశారు. దీనినే అడ్వాంటేజ్ తీసుకున్న కేసీఆర్ మున్సిపల్ ఎన్నికలను సాకుగా తీసుకున్నారు. తనకు అంత టైం లేదన్నారు. అందుకే ఫామ్ హౌస్ లోనే విచారించాలని కోరారు.

















