ఆన్‌లైన్‌లో తప్పుడు కథనాలు ప్రచారంపై ఫిర్యాదు

సైబ‌ర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసిన విజ‌య్, ర‌ష్మిక టీమ్

hellotelugu-VijayRashmika

హైద‌రాబాద్ : ఆన్‌లైన్‌లో తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారంటూ ‘విరోష్’ బృందం హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. విజయ్ దేవరకొండ , రష్మిక మందన్నలకు సంబంధించిన అంశాలపై ఆన్‌లైన్ వేదికల్లో తప్పుడు కథనాలు, కల్పిత కంటెంట్, మార్ఫ్ చేసిన స్క్రీన్‌షాట్లు, ఇతరుల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించడం, లక్షిత ఆన్‌లైన్ వేధింపులకు పాల్పడుతున్నారని పేర్కొంటూ ‘విరోష్’ బృందం ప్రతినిధులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని వారు కోరారు. తాము భావప్రకటనా స్వేచ్ఛను, వ్యక్తుల అభిప్రాయాలను , విమర్శించే హక్కును గౌరవిస్తామ‌ని పేర్కొన్నారు. అయితే సొంత అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి, కల్పిత, మార్పులు చేసిన లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని నిజమని నమ్మించేలా ప్రచారం చేయడానికి చాలా తేడా ఉంది అని వారు పేర్కొన్నారు .

ఫిర్యాదులో పేర్కొన్న ఆన్‌లైన్ ప్రచురణలు, సోషల్ మీడియా కంటెంట్, తప్పుడు కథనాలు, కల్పిత సమాచారం, మార్ఫ్ చేసిన స్క్రీన్‌షాట్లు, నకిలీ ఖాతాలు , వేధింపులకు సంబంధించిన ఆధారాలను, సంబంధిత లింకులను పోలీసులకు అందజేశారు. చట్టప్రకారం ఈ వ్యవహారంపై విచారణ జరగాలని, ముఖ్యంగా ఉద్దేశ పూర్వకంగా తప్పుడు కథనాలను సృష్టించడం, వాటిని ప్రచారం చేయడం లేదా డబ్బు చెల్లించి వ్యవస్థీకృత ప్రచారాలు చేయడం వంటి చర్యలపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. చట్టవి రుద్ధమైన కంటెంట్‌ను ప్రచురించడం, తిరిగి పోస్ట్ చేయడం లేదా విస్తృతం చేయడం వంటి ప్రతి సందర్భాన్ని ప్రత్యేకంగా పరిశీలించాలని, అవసరమైతే చట్టపరమైన మార్గాల ద్వారా తగిన చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇది ఎవరి అభిప్రాయాలను లేదా విమర్శలను అణచివేసే ప్రయత్నం కాదని, కేవలం తప్పుడు సమాచారం లేదా చట్ట విరుద్ధమైన ప్రవర్తన జరిగినప్పుడు బాధ్యతను నిర్ధారించేందుకు చేసిన అభ్యర్థన మాత్రమేనని వారు స్పష్టం చేశారు.

Exit mobile version