సోమందేపల్లి/ శ్రీసత్యసాయి జిల్లా : రాష్ట్రంలో జగన్ తప్పా ప్రజలంతా కూటమి పాలనతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. 18 నెలల కాలంలోనే సీఎం చంద్రబాబు నాయుడు తన అనుభవంతో రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తుండడంతో, జగన్ మైండ్ బ్లాంకై అబద్ధాలు, అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ అసమర్థ పాలనతో గాడి తప్పిన విద్యా వ్యవస్థను రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ గాడిన పెడుతున్నారన్నారు. ఒకవైపు మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తూనే, విద్యార్థులకు నాణ్యమైన భోజనం, తల్లికి వందనం పథకం అమలుతో పాటు విద్యామిత్ర కిట్లు అందజేశామన్నారు.
సోమందేపల్లిలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధి పెద్దపీట వేస్తోందన్నారు. ఉచిత ఇసుక, ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, ఫ్రీ బస్, అన్నదాత సుఖీభవ, అన్న క్యాంటీన్ల..ఇలా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామన్నారు. విద్యార్థులకు సన్న బియ్యంతో నాణ్యమైన భోజనంతో పాటు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో విద్యా మిత్ర కిట్లు అందజేశామన్నారు. కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశామన్నారు. త్వరలో అర్హులైన పేదలందరి సొంతింటి కల నెర వేరుస్తామన్నారు. జగన్ హయాంలో నిలిచిపోయిన ఇళ్లకు నిధులందజేసి, నూతన గృహా ప్రవేశాలు కూడా చేపట్టామన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, విద్యుత్ అందజేస్తున్నామన్నారు.

















