హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిని ఏకిపారేశారు. గవర్నర్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి అతని సోదరులు కలిసి హిల్ట్ స్కాంతో హైదరాబాద్ పారిశ్రామిక వాడల్లోని రూ.5 లక్షల కోట్ల విలువైన 9200 ఎకరాల భూములను కొల్లగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సీఎం తన సోదరుల దోపిడి సరిపోక ఇప్పుడు బావమరిది సృజన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి సింగరేణిని గుత్తకు రాసిచ్చాడని ఫైర్ అయ్యారు కేటీఆర్. ఈ సింగరేణి కుంభకోణాన్ని సీబీఐకి లేదా సిట్‌కు ఇచ్చి ప్రజాధనాన్ని కొల్లగొట్టే ఈ ప్రయత్నాలను అడ్డుకోవాలని గవర్నర్ ను కోరడం జరిగిందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న అవినీతి, ముఖ్యంగా సింగరేణిలో జరుగుతున్న దోపిడీ విషయంలో ప్రతి ఒక్కరూ నిలదీయాలని పిలుపునిచ్చారు. లేక పోతే మరింత దోపిడీ , మోసం జరిగే ప్రమాదం పొంచి ఉందన్నారు.
గవర్నర్ ను కలిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ తరఫున శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, మా సీనియర్ నాయకుల బృందం అందరం కూడా కలిసి గవర్నర్ కు ఒక వివరమైన విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చాం అని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, ముఖ్యంగా సింగరేణిలో జరుగుతున్న దోపిడీ విషయానికి పూర్తిగా ఆధారాలతో సహా వివరించడం జరిగిందన్నారు. ఆధారాలతో సహా మా శాసన సభాపక్ష ఉప నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు పత్రికా సమావేశం పెట్టి, ఆధారాలతో సహా బయట పెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైందన్నారు.

















