హైదరాబాద్ : తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలనంగా మారారు. ఇండియా టుడే – సీఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ప్రధాన మంత్రి అభ్యర్థులుగా మోదీ , రాహుల్ గాంధీ తర్వాత టీవీకే అధినేత విజయ్ మూడో స్థానంలో నిలిచారు. తమిళనాడులో సంపాదించిన ప్రాంతీయ మద్దతుతో పాటు పాన్-ఇండియా సినిమాల ద్వారా ఉత్తరాది యూత్ , జెన్ జీ ఓటర్లలో విజయ్‌కి ఉన్న క్రేజ్ ప్లస్ పాయింట్ గా మారింది. ప్రతిపక్ష కూటమి నాయకత్వ రేసులో 12.2% తో రాహుల్ గాంధీ తర్వాత 2వ స్థానంలో నిలిచారు టీవీకే విజయ్. ప్రధానమంత్రి పదవికి ఉన్న ప్రముఖ అభ్యర్థుల జాబితాలో చోటు దక్కించు కోవడం చర్చనీయాంశంగా మారింది . 2029లో విజయ్‌ను ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దించాలని టీవీకే కోరుకుంటోంది. గత కొన్నేళ్లుగా తమిళనాడు నుండి ఒక ప్రధానమంత్రి రావాలనే ఆలోచన వాస్తవిక ఎన్నికల చర్చ కంటే కేవలం ఒక రాజకీయ ఆకాంక్షగానే మిగిలి పోయింది. అయితే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కేవలం మూడు నెలలు మాత్రమే అయినప్పటికీ, సి. జోసెఫ్ విజయ్ ఇప్పుడు దశాబ్దాలుగా భారత రాజకీయాల్లో కొనసాగుతున్న అగ్రనేతల సరసన నిలిచారు. 2024లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఈ నటుడు-రాజకీయ నాయకుడు తాజా ‘ఇండియా టుడే-సి-ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో తదుపరి భారత ప్రధానమంత్రిగా మూడవ అత్యంత ఆదరణ పొందిన అభ్యర్థిగా నిలిచారు.
ఈ అభిప్రాయ సేకరణ ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. దీనికి కారణం కేవలం విజయ్ స్థానం మాత్రమే కాదు జాతీయ రాజకీయాల్లో ఆయన ఎంత వేగంగా ప్రజల దృష్టిని ఆకర్షించారన్నది కూడా. తదుపరి ప్రధానమంత్రిగా ‘తమిళగ వెట్రి కళగం’ వ్యవస్థాపకుడైన విజయ్‌కు 9.2% మంది మద్దతు లభించింది. ఈ జాబితాలో 48.7% మద్దతుతో ప్రధాని నరేంద్ర మోదీ మొదటి స్థానంలో ఉండగా 27.1% మద్దతుతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రెండవ స్థానంలో ఉన్నారు. తమిళనాడులోని టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఉండటం గమనార్హం. ప్రధాని అభ్యర్థిగా విజయ్ ఆదరణ పెరగడం వల్ల రాహుల్ గాంధీ మద్దతులో కొంత తగ్గుదల ఉన్నారు. ఇక ప్రధాని రేసులో మిగతా నేతలలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (2%), సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (1.7%), కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు , కన్వీనర్ అభిజిత్ డిప్కే (1.3%) , ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (1.2%) కంటే విజయ్ ముందంజలో ఉన్నారు. తదుపరి ప్రధానమంత్రి ఎవరు కావాలనే అంశంతోనే ఈ సర్వేలో విజయ్ ప్రాధాన్యత ఆగిపోలేదు. ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించడానికి ప్రస్తుత ప్రతిపక్ష నాయకులలో ఎవరు అత్యంత అనుకూలమైన వారని అడిగినప్పుడు, విజయ్ 12.2% ఓట్లతో అగ్రస్థానానికి దగ్గరగా నిలిచారు. 29%తో ముందంజలో ఉన్న రాహుల్ గాంధీ తర్వాతి స్థానంలో ఆయన నిలవగా, మమతా బెనర్జీ (8.5%), అరవింద్ కేజ్రీవాల్ (7.5%) , అఖిలేష్ యాదవ్ (6.9%) కంటే ముందున్నారు.
