చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సీరియస్ అయ్యారు. మరాఠా సీఎం దేవేంద్ర ఫడ్నివిస్ ను తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫడ్నవిస్ పర్యటించడం, ఆధారాలు లేకుండా కామెంట్స్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. మదురై ప్రజలను ‘బేరసారాలు, బ్లాక్‌మెయిల్’గా అభివర్ణించారు ఎంకే స్టాలిన్. ఈనెల 23న తమిళనాడు రాష్ట్రంలో శాసన సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా మదురై మెట్రో అభివృద్ధిని ఒక భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యే ఎన్నికతో ముడిపెట్టినందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను తప్పుపట్టారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మదురై నుంచి బీజేపీ అభ్యర్థి రామ శ్రీనివాసన్ నామినేషన్ దాఖలు చేసే సమయంలో, బీజేపీ అభ్యర్థి గెలిస్తేనే మెట్రో ప్రాజెక్ట్ నగరానికి చేరుకుంటుందని ఫడ్నవిస్ పేర్కొన్న తర్వాత స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే ఎన్నికైతేనే మదురైకి మెట్రో ఇస్తామని బేరసారాలు, బ్లాక్‌మెయిల్ చేయడం మహారాష్ట్ర ముఖ్యమంత్రి పనా? రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి, ప్రతిపక్షాలు పాలిత రాష్ట్రానికి వచ్చి ఇలా మాట్లాడటానికి సిగ్గుపడాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పాలనా విజయాలను కూడా హైలైట్ చేశారు. నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినప్పటికీ, తమిళనాడు ప్రభుత్వం ఎన్ని మైలురాయి ప్రాజెక్టులను అమలు చేస్తోందో ఆయనకు తెలుసా? తెలియకపోతే, మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి అని స్పష్టం చేశారు. మీరు డబుల్ ఇంజిన్ అంటూ గొప్పలు చెప్పుకునే జంక్-ఇంజిన్ రాష్ట్రాలను అధిగమించి ద్రావిడ్ మోడల్ ను అమలు చేస్తూ అభివృద్ది చేసిన విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు.















