బెంగళూరు : కర్ణాటక రాజకీయ సంక్షోభానికి తాత్కాలికంగా తెర దించే ప్రయత్నం చేసింది ఏఐసీసీ హైకమాండ్. సీఎం పదవిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం సీఎంగా ఉన్న సిద్దరామయ్య దిగి పోతారని, ఆయన స్థానంలో డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ కు ఛాన్స్ ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇదే సమయంలో సీఎం, డిప్యూటీ సీఎం గ్రూపులుగా ఎమ్మెల్యేలు, మంత్రులు విడి పోయారు. చివరకు పరిస్థితి చేయి దాటి పోవడంతో రంగంలోకి హైకమాండ్ దిగింది. సిద్దరామయ్య, డీకే శివకుమార్ లతో వేర్వేరుగా చర్చలు జరిపింది. ప్రస్తుతానికి టీ కప్పులో తుపాను లాగా చెక్ పెట్టడంతో ఇద్దరూ ఓ అంగీకారానికి వచ్చినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా అందరినీ ఆశ్చర్య పరిచేలా డీకే శివకుమార్ స్వయంగా సీఎం సిద్దరామయ్య ఇంటికి వెళ్లారు. ఆయనను బ్రేక్ పాస్ట్ చేసేందుకు రావాలని కోరారు సీఎం. దీంతో ఇద్దరూ కలిసి అల్పహారం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయని, వాటి పైనే చర్చలు జరిగాయని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. అయితే సీఎం పదవి మార్పు విషయంపై ఎలాంటి చర్చ జరగలేదని చెప్పారు. కాగా తామిద్దరం పాలనా పరంగా మరింత నిర్ణయాలు తీసుకునేందుకు ఫోకస్ పెడతామన్నారు. హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి తాము ఇద్దరం కట్టుబడి ఉంటామని ప్రకటించారు. తాజాగా తన ఇంటికి రావాల్సిందిగా డీకే శివకుమార్ సిద్దరామయ్యను ఆహ్వానించారు. ఈ మేరకు మంగళవారం సీఎం డిప్యూటీ సీఎం ఇంటికి వెళ్లనున్నారని సీఎం క్యాంపు కార్యాలయం వెల్లడించింది.















