CM Revanth Reddy : హైదరాబాద్ : మొంథా తుపాను తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. మంగళవారం అర్ధరాత్రి నుండి బుధవారం వరకు ఇంకా వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్నాయి వర్షాలు. దీంతో తుపాను తీవ్రతపై సచివాలయంలో సమీక్ష చేపట్టారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వరి కోతలు ప్రారంభమై, అనేక చోట్ల ధాన్యం ఎండి పోతున్నందున, నష్టాన్ని నివారించడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వరి, పత్తి కొనుగోలు కేంద్రాల్లో కూడా సరైన ఏర్పాట్లు చేయాలని అన్నారు సీఎం.
CM Revanth Reddy Instructions
అన్ని శాఖల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డోర్నకల్ వద్ద గోల్కొండ ఎక్స్‌ప్రెస్, గుండ్రాతి మడుగు వద్ద కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఆగి పోవడం వంటి రైళ్ల అంతరాయాల దృష్ట్యా ప్రయాణీకులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు సీఎం. సమర్థవంతమైన రక్షణ, సహాయ చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సమన్వయం చేసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు సూచించారు రేవంత్ రెడ్డి. జలాశయాలు, ట్యాంకులు, చెరువులలో నీటి మట్టాలను పర్యవేక్షించాలని అన్నారు. స్థానిక సిబ్బందికి ముందస్తు సమాచారం ఇచ్చిన తర్వాత నియంత్రిత పద్ధతిలో నీటిని విడుదల చేయాలని స్పష్‌టం చేశారు. పూర్తిగా నిండిన జలాశయాలలో ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని ఆయన అన్నారు. ముంపునకు గురైన రోడ్లు, లోతట్టు వంతెనలు, కాజ్‌వేలపై ట్రాఫిక్‌ను పరిమితం చేయాలన్నారు.
పోలీసులు, రెవెన్యూ అధికారులు భద్రత కోసం బారికేడ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం.
Also Read : DK Shivakumar Growth : డీకే శివ కుమార్ కు సీఎం అయ్యే ఛాన్స్
