హైదరాబాద్ : ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎక్కువగా ఫోకస్ పెట్టిందని అన్నారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. విద్య, వైద్యం, ఉపాధి కల్పన, పరిశ్రమల ఏర్పాటు, మహిళా సాధికారిత , ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం అందించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. గురువారం ఫిన్‌లాండ్, జర్మనీ దేశాలలో పర్యటించి వచ్చిన ఉపాధ్యాయుల బృందంతో ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సీఎం. ఆయనతో పాటు ప్రభుత్వ ముఖ్య సలహాదారు కే.కేశవరావు , విద్యా, తదితర శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా టీచర్ల బృందాన్ని ఉద్దేశిస్తూ కీలక ప్రసంగం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్ పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్ చేంజ్ కార్యక్రమంలో భాగంగా ఫిన్‌లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటించిన ఉపాధ్యాయుల బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి శిక్షణల వల్ల ఎంతో నేర్చుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. అంతే కాకుండా తాము శిక్షణ పొందిన అనుభవాన్ని తిరిగి విద్యార్థులకు అందించేందుకు మార్గం ఏర్పడుతుందన్నారు. తమ ప్రభుత్వం తెలంగాణలోనూ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యా వ్యవస్థ ఉండాలనే లక్ష్యంతో కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు సీఎం.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో కీలకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. ఇందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను ప్రతీ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు .కుల, మత, వర్గం అనే ప్రాతిపదకన లేకుండా ప్రతి ఒక్కరు ఇందులో చదువుకునేందుకు అవకాశం లభిస్తుందని చెప్పారు సీఎం.
