హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఆయన గతంలో ఇచ్చిన హామీ మేరకు ఇండియాలో అత్యంత పేరు పొందిన , ఘనమైన చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్శిటీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇచ్చిన హామీ మేరకు ఆయన ఇటీవల ఓయూను సందర్శించారు. ఈ సందర్బంగా విద్యార్థులు, అధ్యాపకులు, ఫ్రొఫెసర్లతో సంభాషించారు. మరోసారి తాను ఓయూను సందర్శిస్తానని ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు రేవంత్ రెడ్డి. ఈ నెల 10 న యూనివర్సిటీ ని సందర్శించాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.
విద్యార్థుల సంఖ్య ఆధారం గా యూనివర్సిటీ లో భవన నిర్మాణాలు, ఇతర మౌలిక సదుపాయాలు ఉండాలని స్పష్టం చేశారు. యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నాం అన్న విషయాన్ని ప్రకటించారు. యూనివర్సిటీ అభివృద్ధి ప్రణాళిక పైన విద్యార్థుల అభిప్రాయాలు కూడా తీసుకోవాలని సూచించారు సీఎం. అన్ని అభిప్రాయాలు క్రోడీకరించుకుని డిసెంబర్ 31 న పూర్తి ప్రణాళిక ను ప్రకటించాలని ఆదేశించారు వీసీ, ఇతర ఉన్నత విద్యా శాఖ అధికారులను. ప్రపంచంలో బెస్ట్ యూనివర్సిటీ గా ఉస్మానియా ను తీర్చిదిద్దాలన్నది సర్కార్ ఆకాంక్ష అని స్పష్టం చేశారు అనుముల రేవంత్ రెడ్డి. ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, ఓయూ వీసీ ప్రొఫెసర్ శ్రీ కుమార్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
