చెన్నై : టీవీకే నేతృత్వంలోని కూటమిని ‘అవకాశవాద డబ్బు సంచుల కూటమి’గా అభివర్ణించింది డీఎంకే పత్రిక మురసోలి. అధికార పార్టీ కూటమికి లౌకిక సామాజిక న్యాయ విజయ కూటమి అని పేరు పెట్టడాన్ని ప్రస్తావించింది. వారి ముఖాలను చూడండి అంటూ పేర్కొంది. అధికార పార్టీకి చెందిన ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్, ఆ కూటమి నాయకులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే శుక్రవారం నాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌ను “అవకాశవాది” అని పేర్కొంది. అలాగే, ఆయన ఏర్పాటు చేసిన కూటమికి ఎటువంటి నైతికత లేదని, అది కేవలం ఒక అవకాశవాద డబ్బు సంచుల కూటమి అని ఎద్దేవా చేసింది. ఒకప్పుడు ఏ పార్టీలనైతే విజయ్ కేవలం ఇతరులు అని కొట్టిపారేశారో, ఇప్పుడు వారితోనే చేతులు కలపడం ద్వారా, ఆయన స్వయంగా ఆ “ఇతరుల” వర్గంలోనే ఒకరిగా మారిపోయారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏ పార్టీలనైతే ఆయన డబ్బు సంచుల కూటమి పార్టీలు అని ముద్ర వేశారో, వాటన్నింటినీ ఇప్పుడు విజయ్ ఒకచోట చేర్చారని ఆ పత్రిక పేర్కొంది.
విజయ్ మాటల ప్రకారమే చూస్తే, ఇప్పుడు వారిని ‘డబ్బు సంచుల కూటమి పార్టీలు’ అని పిలవకూడదా? ఒకప్పుడు ఈ పార్టీల పేర్లను ప్రస్తావించడానికి కూడా అనర్హమైనవిగా భావించిన వ్యక్తి విజయ్. అప్పట్లో ఆయన వాటిని కేవలం ఇతరులు అని మాత్రమే పేర్కొన్నారు. కానీ ఇప్పుడు, ఆ ఇతరుల”నే అందరినీ ఏకం చేసిన తర్వాత, ఆయన థంబ్స్ అప్ (విజయ సంకేతం) చూపిస్తున్నారు. సెప్టెంబర్ 11 నాటి సంపాదకీయంలో డీఎంకే పత్రిక ఇలా పేర్కొంది మిగిలిన ఇతరుల”తో చేతులు కలపడం ద్వారా ముఖ్యమంత్రి స్వయంగా ఆ ఇతరులలో ఒకరిగా మారిపోయారు. విజయ్ ఒకప్పుడు ఇలా అన్నారు అరివాలయం గేట్ల గుండా నడిచి వెళ్తే చాలు, వారు ఆ పార్టీలను లోపలికి పిలిచి సీట్లు ఇచ్చేస్తారు. కానీ నేడు, ఆ గేట్ల గుండా నడిచి వెళ్లడం ద్వారా శాసనసభలో అడుగుపెట్టే అర్హతను పొందిన పార్టీల మద్దతుతోనే విజయ్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని ఉన్నారని ఆరోపించింది.
పనైయూర్‌లోని టీవీకే ప్రధాన కార్యాలయ గేటు బయట అదే వర్గాలతో ఆయన ఫోటో షూట్ నిర్వహించారని ఆ కథనం పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ డీఎంకే కు అమ్ముడు పోయింది అని ముఖ్యమంత్రి గతంలో విమర్శించారు. ఇప్పుడు, కాంగ్రెస్ పార్టీని “కొనుగోలు” చేయడానికి విజయ్ ప్రతిఫలంగా ఏమి ఇచ్చారని ఆ కథనం ప్రశ్నించింది. ఎన్నికల సమయంలో, డీఎంకే నేతృత్వంలోని కూటమిని టీవీకే అధినేత ఎగతాళి చేస్తూ… అది అతుకులు వేసిన పగిలిన అద్దం లాంటిదని, కుట్టిన చిరిగిన వస్త్రం లాంటిదని వ్యాఖ్యానించారు. అలాగే ఆ కూటమి ప్రజల సంక్షేమం కోసమేనా అని ప్రశ్నించారు. ఆయన ఈ రోజు ఏర్పాటు చేసిన కూటమిని చూడండి, అది చిరిగిపోయి కుట్టిన వస్త్రంలా కనిపిస్తోంది. ఆ ఐదుగురి ముఖాలు పగిలి అతుకులు వేసిన అద్దంలా ఉన్నాయి అని ఆ కథనంలో ఎద్దేవా చేసింది.
