తిరుపతి : వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో ఏర్పాటు చేసుకునే మండపాల్లో విద్యుత్ ప్రమాదాలకు చోటివ్వొద్దని ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ శివ శంకర్ లోతేటి శుక్రవారం పేర్కొన్నారు. వినాయకుడి మండపాల్లో విద్యుత్ అలంకరణలు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, ఎటువంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. మండపాలను విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలకు నిర్ణీత దూరంలో ఏర్పాటు చేయాలని, మండపాల మీదుగా విద్యుత్ తీగలు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ దీపాలతో అలంకరణ కోసం నాణ్యమైన విద్యుత్ పరికరాలనే వాడాలని సూచించారు. అలంకరణ పనులను అర్హత కలిగిన ఎలక్ట్రిషియన్లతోనే చేయించుకోవాలని సూచించారు.
అధిక వాటేజ్ కలిగిన విద్యుత్ దీపాలను వినియోగించే సందర్భాల్లో ప్రమాదాలు చోటుచేసు కోకుండా తగిన సామర్థ్యం కలిగిన వైరింగుతోపాటు నాణ్యతతో కూడిన పరికరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో 3 కిలోవాట్ల వరకు, పట్టణ ప్రాంతాల్లో 5 కిలోవాట్ల వరకు లోడ్ కలిగి ఉన్న వినాయకుడి మండపాలకు ఉచితంగా విద్యుత్తును సరఫరా చేస్తామని తెలిపారు. ఆపైన లోడ్ కలిగి ఉన్న మండప నిర్వాహకులు నిబంధనల మేరకు రుసుమును చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. వినాయక మండపాలకు తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ కోసం నిర్వాహకులు తమ సమీపంలోని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయాన్ని సంప్రదించి, కనెక్షన్ ను పొందవచ్చని సూచించారు.
వర్షం కురిసే సందర్భాల్లో విద్యుత్ పరికరాలు తడిచి పోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు సీఎండీ. వర్షంతో తడిచిన విద్యుత్ పరికరాలను చేతితో తాకకూడదని హెచ్చరించారు. వినాయకుడి నిమజ్జనం ఊరేగింపు సందర్భాల్లో కూడా విద్యుత్ సిబ్బంది సహకారంతో విద్యుత్తు లైన్ల కింద జాగ్రత్తగా దాటుకుంటూ వెళ్లాలని సూచించారు. విద్యుత్ తీగలు తెగి పడడం లేదా వేలాడుతుండడాన్ని గుర్తించి నట్లయితే, వాటికి దూరంగా ఉంటూ వెంటనే తమ సమీపంలోని విద్యుత్ శాఖ అధికారులకు గానీ, సిబ్బందికి గానీ లేదా టోల్-ఫ్రీ నంబరు: 1912కు కాల్ చేసి సమాచారాన్ని అందించాలని కోరారు. వినాయక చవితి సందర్బంగా మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి నిర్వాహకులకు అహగాహన కల్పించాలని సూచిస్తూ ఆయా సర్కిళ్ళ సూపరింటెండింగ్ ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో సురక్షితంగా జరుపుకోవాలని సిఎండి శివ శంకర్ లోతేటి కోరారు.
