CM Chandrababu : అమరావతి : యావత్ తెలుగు వారు గర్వ పడేలా , ప్రతి ఒక్కరు స్మరించుకునేలా దివంగత ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు జ్ఞాపకార్థం త్వరలోనే స్మృతి వనం నిర్మిస్తామని ప్రకటించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu). తెలుగు భాష, లిపి పరిణామాన్ని వర్ణించే అంశాలతో పాటు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు , అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు వంటి సాంస్కృతిక ప్రముఖుల విగ్రహాలను చేర్చాలని కూడా సీఎం సూచించారు. తెలుగు గర్వం, సంస్కృతి, సాహిత్యం, చరిత్రకు స్మారక నివాళిగా అమరావతిలో ప్రతిపాదిత ఎన్టీఆర్ స్మృతివన్‌ను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.
CM Chandrababu Key Comments
నీరుకొండలో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్, ప్రజలలో ఆత్మ గౌరవం, విశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు తెలుగు వారసత్వ గొప్పతనాన్ని ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకోవాలని స్పష్టం చేశారు సీఎం. తన క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి 182 మీటర్ల ఎత్తైన ఎన్.టి. రామారావు విగ్రహ నమూనాలను పరిశీలించారు. ఇది స్మారక చిహ్నంగా ఉపయోగ పడుతుందన్నారు. ప్రాజెక్టు రూపకల్పనలో తెలుగు సంప్రదాయాలు, భాష, కళ, సాహిత్యం, ప్రాచీన చరిత్రను నొక్కి చెప్పాలని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. ఈ ప్రాజెక్ట్ అమరావతిని ప్రజల రాజధానిగా హైలైట్ చేయాలని , తెలుగు గుర్తింపునకు చిహ్నంగా ఉండేలా చూడాలన్నారు. ఈ ప్రాజెక్టుతో పాటు నీరుకొండ జలాశయాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు .
Also Read : Israel Attack on Gaza : గాజాపై ఇజ్రాయెల్ దాడి 32 మంది దుర్మరణం
