అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 కు ఈనెల 20వ తేదీన శుక్రవారం హాజరు కానున్నారు. అక్కడ ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. రేపు ఉదయం జైపూర్ నుంచి ఢిల్లీకి చేరుకోనున్నారు. 9.30 గంటలకు ఏఐ యాక్సిలరేటర్స్, ఫ్యూయలింగ్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ అనే అంశంపై జరిగే ప్లీనరీ సెషన్‌లో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద, టీసీఎస్ ప్రతినిధులతో కలిసి సీఎం పాల్గొనున్నారు. అనంతరం రాష్ట్రంలో ఏఐ మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి కల్పనకు సంబంధించిన కొన్ని ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకోనుంది. ఏఐ, క్వాంటం టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో ఏపీలోని 10 లక్షల మంది యువతకు నైపుణ్యాలు కల్పించేలా ప్రతిష్టాత్మక ఐటీ సంస్థ ఐబీఎంతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది.
క్వాంటంతో పాటు ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రం ఏర్పాటు కోసం యూనిసీసీ సంస్థతోనూ ఒప్పందం జరుగనుంది. ఏపీలో క్వాంటం ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఎన్ఐఈఎల్ఐటీ తోనూ రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ చేసుకోనుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ట్యూటర్ ఏర్పాటు కోసం ఐఐటీ మద్రాస్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఎన్విడియా భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటుపై ప్రకటన చేయనున్నారు. అనంతరం క్వాంటెలా ఇంక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శ్రీధర్ గాంధీతోనూ ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. మద్యాహ్నం 12 గంటలకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే రౌండ్ టేబుల్ కార్యక్రమంలో పాల్గోనున్నారు. కృత్రిమ మేధస్సు ద్వారా పోటీతత్వం అనే అంశంపై నిర్వహించే ఈ రౌండ్ టేబుల్ సదస్సులో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీఈఓ బోర్కే బ్రెండే తో కలిసి ముఖ్యమంత్రి చర్చించనున్నారు.
