హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి మాజీ సీఎం కేసీఆర్ చేసిన అన్యాయం గురించి ఎంత చెప్పినా తక్కవేనంటూ సంచలన ఆరోపణలు చేశారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. నీళ్లు – నిజాలపై ప్రజా భవన్ లో సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు హాజరయ్యారు. తెలంగాణ సాగునీటి రంగానికి ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కంటే… కల్వకుంట్ల చంద్రశేఖరరావు, హరీష్ రావులు చేసిన అన్యాయం తీవ్రమైనది అన్న విషయం 2014 – 23 ఇరిగేషన్ రికార్డులను పరిశీలిస్తే అర్థమవుతోందని ఈ సందర్బంగా అన్నారు.
జూరాల వద్ద నిర్మించాల్సిన పాలమూరు – రంగారెడ్డి పథకాన్ని శ్రీశైలం బ్యాక్ వాటర్ కు మార్చడం కేసీఆర్ చేసిన చారిత్రక తప్పిదం అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఎ. రేవంత్ రెడ్డి. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలలో రాష్ట్ర విభజన తర్వాత పరివాహక ప్రాంతం ప్రకారం తెలంగాణకు 79 శాతం వాటా డిమాండ్ చేయాల్సిన కేసీఆర్ ప్రభుత్వం కేవలం 299 టీఎంసీలకు ఒప్పుకుని సంతకాలు చేయడం దక్షిణ తెలంగాణ పాలిట మరణ శాసనంగా మారిందని ఆరోపించారు.
పాలమూరు – రంగారెడ్డి స్థలాన్ని జూరాల నుండి శ్రీశైలంకు కేసీఆర్ మార్చడం ద్వారా కృష్ణా జలాల్లో ఏపీ రోజుకు 13.37 టీఎంసీలకు పైగా తరలించుకునే వీలు దక్కిందన్నారు. అదే సమయంలో తెలంగాణ మాత్రం 0.25 టీఎంసీలకు మించి వాడుకోలేని దుస్థితికి కేసీఆర్ తప్పుడు నిర్ణయాలే కారణం అని ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి. జూరాలను కాదని శ్రీశైలం వద్ద నీళ్లు తీసుకోవాలని ప్రతిపాదించడం వల్ల మూడు స్టేజ్ లు ఐదు స్టేజ్ లకు, 22 పంపులు 37 పంపులకు, 32 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయం… 84 వేల కోట్ల రూపాయలకు కి పెరిగిందన్నారు. ఈ పాపం కేసీఆర్ ది కాదా!? ఏ మాత్రం ఆలోచన ఉన్నా… తల దగ్గర కాకుండా తోక దగ్గర నీళ్లు తీసుకుంటారా అని ప్రశ్నించారు.
పాలమూరు రంగారెడ్డి కేవలం తాగునీళ్ల ప్రాజెక్ట్ అని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం 7.15 టీఎంసీ లకు అనుమతి తీసుకొచ్చింది. ఇలా అనుమతి తేవడం వెనుక రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టి… పంపులు, లిఫ్ట్ కాంట్రాక్టర్ల బిల్లులకు ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు సీఎం. పరివాహక ప్రాంతం ఆధారం గా తెలంగాణ కు 79 శాతం, ఏపీ కి 21 శాతం వాటా ఇవ్వాలని తాము వాదిస్తున్నామన్నారు.
