న్యూఢిల్లీ : కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అభిజిత్ దీప్కే సారథ్యంలోని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేఐ) ఆధ్వర్యంలో ఢిల్లీలో చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దేశ రాజధానిలో సీజేపీ నిరసన హింసాత్మకంగా మారడంతో, పలువురు సీనియర్ అధికారులతో సహా కనీసం 118 మంది పోలీసు సిబ్బంది గాయపడగా, సుమారు 70 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం, నిరసనకారులు పార్లమెంటు వైపు దూసుకెళ్లే ప్రయత్నంలో భద్రతా సిబ్బందిపై దాడి చేసి, ప్రభుత్వ వాహనాలు, ప్రజా ఆస్తులను ధ్వంసం చేశారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ అశాంతి నేపథ్యంలో, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నిరసన చేస్తున్న సీజేపీకి చెందిన ఇద్దరు ప్రతినిధులతో చర్చలు జరిపారు. విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సహా వారి డిమాండ్లపై ప్రభుత్వ నాయకత్వం అంతర్గత చర్చలు జరుపుతుందని వారికి హామీ ఇచ్చారు. మరో వైపు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఆందోళనకారులకు మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా మోదీ సర్కార్ ను ఏకి పారేశారు. దేశంలో ప్రజాస్వామ్యం అనేది లేకుండా పోయిందన్నారు. భారత రాజ్యాంగం స్పూర్తిని దెబ్బతీసేందుకు ప్రయత్నం జరుగుతోందని ఆవేదన చెందారు. మరో వైపు ప్రముఖ నటుడు, ప్రజాస్వామిక కార్యకర్త ప్రకాశ్ రాజ్ సైతం సీజేపీ ఆందోళనకు మద్దతు తెలిపారు. ఇంకో వైపు పర్యావరణ ప్రేమికుడు సోనం వాంగ్ చుక్ ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం.
