విశాఖపట్నం : కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడింది సీఐటీయూ. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంఎన్ఆర్ఈజీఏ) లో మార్పులు చేయడం పట్ల మండిపడింది. ఇందులో భాగంగా సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు గురువారం సంస్థ కీలక ప్రకటన చేసింది. వచ్చే ఫిబ్రవరి 12వ తేదీన దేశ వ్యాప్తంగా సమ్మె చేయాలని పిలుపునిచ్చింది. అసలు పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఈ స్కీంలో వేతనాలను పూర్తిగా భరించిందని, అయితే సవరించిన విధానంలో వేతన భారం 40 శాతాన్ని రాష్ట్రాలకు బదిలీ చేశారని ఆరోపించింది. విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో గురువారం జరిగిన సీఐటీయూ 18వ అఖిల భారత సదస్సులో మాజీ ఎంపీ, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ కుమార్ సేన్ ప్రసంగించారు.
సవరించిన విధానం ఉపాధికి హామీ ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సేన్ మాట్లాడారు. 18వ అఖిల భారత సీఐటీయూ సదస్సు కోసం నగరానికి వచ్చిన వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ఈ విషయంపై చర్చించి, నిరసన చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారని చెప్పారు. వేతన భారం 40 శాతాన్ని రాష్ట్రాలకు బదిలీ చేయడం పూర్తిగా చట్ట విరుద్దమన్నారు. రాష్ట్రాలు నిధుల కొరతను ఎదుర్కొంటే, కొత్త విధానంలో హామీతో కూడిన పని లేనందున ఈ పథకం ఆగిపోతుందని ఆరోపించారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో 30 శాతం ప్రైవేటీకరించినప్పటికీ, గత ఐదేళ్లుగా కార్మిక సంఘాల నిరంతర పోరాటాల వల్ల దాని ప్రైవేటీకరణను నిరోధించ గలిగామని సేన్ అన్నారు.
