కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి వరుస భేటీలు

ఒకరోజు ముందే నారా చంద్ర‌బాబు సమావేశాలు

hellotelugu-APCM

అమ‌రావ‌తి : విశాఖ వేదిక‌గా సీఐఐ స‌ద‌స్సు 2026కు వేదిక కానుంది. ఈ స‌ద‌స్సు రెండు రోజుల పాటు జ‌ర‌గ‌నుంది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది ఏపీ కూట‌మి స‌ర్కార్. ఇదిలా ఉండ‌గా సదస్సులో వివిధ శాఖలకు చెందిన కేంద్ర మంత్రులతో సీఎం ఈ రెండు రోజుల్లో సమావేశం కానున్నారు. వివిధ రంగాల్లో పారిశ్రామికాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు… రాష్ట్రానికి అందించాల్సిన చేయూతపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించనున్నారు. అలాగే రాష్ట్రంలోని వివిధ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా కొన్ని వెసులుబాట్లు కల్పించే అంశాలను కేంద్ర మంత్రుల వద్ద ప్రస్తావించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో తలెత్తుతున్న పరిణామాలతో రాష్ట్రంలోని పలు రంగాలపై పడుతున్న ప్రభావాన్ని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, చిరాగ్ పాశ్వాన్‌, ప్రహ్లాద్ జోషి, సర్బానంద సోనోవాల్ వంటి వారితో సీఎం భేటీ కానున్నారు.

సమ్మిట్‌కు ఒకరోజు ముందుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో అమరావతి, విశాఖల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. బుధవారం సింగపూర్ మంత్రి గాన్ సియో హువాంగ్‌తో అమరావతిలో సమావేశమవుతారు. అనంతరం విశాఖ చేరుకుని వివిధ భేటీల్లో పాల్గొంటారు. డబ్ల్యూఐపీవో డైరెక్టర్ జనరల్ డారెన్ టాంగ్, జపాన్ రాయబారి కీచి ఒనో, యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీ, రెన్యూ సంస్థ సీఈవో సుమంత్ సిన్హాలతో బుధవారమే సమావేశం కానున్నారు. బుధవారం సాయంత్రం సీఐఐ సీఈవోలతో సమావేశం, అంతర్జాతీయ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటు చేసిన స్వాగత విందులో పాల్గొంటారు.

Exit mobile version