అమరావతి : అపారమైన రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండడం ఏపీకి వరం లాంటిదని పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్. కసితో పనిచేసే టీమ్ ఉంది. శాసనసభ్యుల్లో 50 శాతం మంది కొత్తగా ఎన్నికైన వారు ఉన్నారు. 25 మంది మంత్రుల్లో 17 మంది కొత్తవారు. నేను సీనియర్ మంత్రిని. రెండో పర్యాయం మంత్రిగా పని చేస్తున్నాను. చంద్రబాబు విజన్ సాధనకు మేమంతా కసితో పని చేస్తున్నాం. రెండో కారణం స్పీడ్ ఆఫ్ డూయంగ్ బిజినెస్. అందరం కలిసి చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఒక్క జూమ్ కాల్ తోనే ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏపీకి వచ్చింది. స్పీడ్ అనేది చాలా ముఖ్యం. మూడో కారణం ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది.
ఏపీలో నమో అంటే ప్రధాని నరేంద్ర మోదీ , ముఖ్యమంత్రి నాయుడు కలయిక. ఇద్దరూ 75 ఏళ్ల యువకులు. వారిలో 25 ఏళ్ల యువకులు ముగ్గురు ఉన్నారు. భూకేటాయింపుల నుంచి అనుమతుల వరకు మేం మీతో కలిసి ఉంటాం. ఒక్కసారి మాతో చేతులు కలిపిన తర్వాత అది మీ ప్రాజెక్ట్ కాదు.. మన ప్రాజెక్ట్. ఏం అవసరం వచ్చినా వాట్సాప్ మెసేజ్ దూరంలో అందుబాటులో ఉంటాం అన్నారు నారా లోకేష్. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు. పెట్టుబడులు కేవలం డబ్బు కోసం మాత్రమే కాదు.. మన యువతకు నైపుణ్యం, ఉపాధి కల్పన కోసం నైపుణ్యం పోర్టల్ ను తీసుకు వస్తున్నాం అని ప్రకటించారు. దీనిద్వారా యువతకు పరిశ్రమలకు అవసరమైన శిక్షణ అందిస్తాం. క్లస్టర్ విధానంలో ముందుకు వెళ్తున్నాం. విశాఖ గ్లోబల్ ఏఐ హబ్ గా రూపుదిద్దుకుంటుంది అని చెప్పారు.

















