అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ రెండేళ్ల పనితీరుపై నివేదికలను విడుదల చేయాలని ఆదేశించారు. సంక్షేమం, అభివృద్ధి , పాలనలో సాధించిన స్పష్టమైన విజయాలను ప్రజల ముందు ఉంచాల్సిన అవసరాన్ని నాయుడు నొక్కి చెప్పారు. ఇక్కడ మంత్రులు , అధికారులతో జరిగిన సమావేశంలో 2024 నుండి ప్రభుత్వ పనితీరును ప్రతిబింబించే సమగ్ర నివేదికలను సిద్ధం చేయాలని సీఎం వివిధ శాఖలను ఆదేశించారు. విద్యుత్ రంగానికి సంబంధించిన నివేదికతో ప్రారంభించి, ముఖ్యమంత్రి తన ప్రభుత్వం అధికారంలో ఉన్న మొదటి రెండేళ్లలో సాధించిన విజయాలపై ‘ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26’ పత్రాల శ్రేణిని విడుదల చేయనున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విడుదల చేసిన ఏడు శ్వేతపత్రాలకు సంబంధించి తీసుకున్న చర్యలను ఈ నివేదికలు తెలియ జేయాలని ఆయన పేర్కొన్నారు.
వివిధ రంగాలలో చేపట్టిన సరిదిద్దే చర్యలు , సాధించిన పురోగతిని ఇవి హైలైట్ చేస్తాయన్నారు. వైఎస్సార్‌సీ హయాంలో “పరిపాలనా, ఆర్థికపరమైన ఎదురుదెబ్బలు” తిన్న రాష్ట్రాన్ని ప్రభుత్వం ఎలా మార్చిందో, రెండేళ్లలో “దానిని ఎలా అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చిందో” నివేదికలు వివరించాలని ముఖ్యమంత్రి అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, పరిపాలనలో సాధించిన స్పష్టమైన విజయాలను ప్రజల ముందు ఉంచాలన్నారు . ఏడు శ్వేతపత్రాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పోలవరం ప్రాజెక్ట్, అమరావతి రాజధాని అభివృద్ధి, విద్యుత్ రంగం, శాంతిభద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ రంగాలను కవర్ చేశాయి. అదనంగా, నివేదికలు అభివృద్ధి, సుపరిపాలన, సంక్షేమం/సాధికారత అనే మరో మూడు అంశాలను కూడా హైలైట్ చేస్తాయని తెలిపారు సీఎం .
అభివృద్ధి పురోగతి నివేదిక వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పర్యాటకంపై దృష్టి సారిస్తుందని చెప్పారు. సుపరిపాలన నివేదిక ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానపరమైన కార్యక్రమాలు, పరిపాలనా సంస్కరణలు, పాలనా చర్యలను వివరిస్తుందని తెలిపారు సీఎం.
