పాల‌మూరు రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై కేంద్రం కుట్ర

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన మాజీ మంత్రి నిరంజ‌న్ రెడ్డి

hellotelugu_Nirannjanreddy

హైద‌రాబాద్ : కేంద్ర స‌ర్కార్ నిర్వాకంపై మాజీ మంత్రి నిరంజ‌న్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. .పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ ను కేంద్రం వెనక్కి పంపడం ఒక కుట్ర త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణం అని పేర్కొన్నారు. తెలంగాణ నీటి హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర అధికారులకు అప్పగించింద‌ని మండిప‌డ్డారు. తన గురువు చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి పాలమూరు భవిష్యత్తును పణంగా పెడుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులపై లేని అభ్యంతరాలు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎందుకు ఉన్నాయ‌ని ప్ర‌శ్నించారు. ఆంధ్ర ప్రయోజనాల కోసం బీజేపీ తెలంగాణను బలి చేస్తోందన్నారు.

ఎనిమిది మంది బీజేపీ, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు చేతులు కలిపి కలిసి కూర్చుంటున్నార‌ని ఇప్ప‌టి వ‌ర‌కు పాల‌మూరు, రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప్రాజెక్టుకు జ‌రుగుతున్న అన్యాయం గురించి ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేద‌న్నారు నిరంజ‌న్ రెడ్డి. తెలంగాణ ప్రాజెక్టుల కోసం పార్లమెంటులో ఒక్కరు కూడా గ‌ళం విప్పడం లేదన్నారు. కర్ణాటక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో కాంగ్రెస్, బీజేపీలు ద్వంద్వ ప్రమాణాలతో కూడిన నాటకం ఆడుతున్నాయని ఆరోపించారు.

బీఆర్ఎస్ హయాంలోనే హైడ్రాలజీ (జల లభ్యత) మినహా మిగిలిన అన్ని అనుమతులు వ‌చ్చాయ‌న్నారు. ఇంత జ‌రిగినా చివ‌రి నిమిషంలో డీపీఆర్ ను వెన‌క్కి పంపించ‌డం స‌రికాద‌న్నారు. సుప్రీంకోర్టు ఇటీవల అనుమతి ఇవ్వడంతో పాటు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి కూడా లభించిందన్నారు. ఇప్పుడు కేవలం నీటి కేటాయింపులకు సంబంధించిన హైడ్రాలజీ అంశం మాత్రమే మిగిలి ఉందన్నారు. హైడ్రాలజీ అంశం కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌లో కూడా పెండింగ్‌లో ఉందన్నారు నిరంజ‌న్ రెడ్డి.

Exit mobile version