న్యూఢిల్లీ : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానంపై మాట్లాడారు ఎంపీ రాహుల్ గాంధీ. జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన అనేది, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవిపై అభిశంసన అనేది రెండూ పూర్తిగా భిన్నమైన విషయాలు అని, ఈ రెండింటి మధ్య చాలా పెద్ద తేడా ఉందన్నారు. జ్ఞానేశ్ కుమార్ ఒక వ్యక్తి. అదే సమయంలో ఆయన ఒక రాజ్యాంగ సంస్థలో భాగం కూడా. మనమందరం పార్లమెంట్ సభ్యులుగా లోక్‌సభలో లేదా రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, మనం కేవలం వ్యక్తులుగా మాత్రమే ఉండబోమని అర్థం. మనకు రెండు వ్యక్తిత్వాలు ఉంటాయి. ఒకటి మన వ్యక్తిగత వ్యక్తిత్వం. మరొకటి భారత సమాఖ్య వ్యవస్థలోని ఒక సంస్థలో భాగంగా మనకుండే వ్యక్తిత్వం.
250 మంది పార్లమెంట్ సభ్యులు, పౌర సమాజ ప్రతినిధులు, సామాన్య పౌరులు, మీడియా ప్రతినిధులు ప్రతిపక్ష నేత ఖర్గే నివాసంలోని గార్డెన్ లో కూర్చొని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై బహిరంగ అభిశంసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు . ఒక్కసారి ఆలోచించండి. ఇంత అసాధారణమైన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? మొదటిది, మనం ఖర్గే నివాసంలోని గార్డెన్ లో ఎందుకు సమావేశమవ్వాల్సి వచ్చింది? రెండవది ఈ ప్రశ్నను లేవనెత్తడానికి మనకు వేరే మార్గమే లేదా? ఈ దేశంలోని మిగతా సంస్థలకు ఏమైంది? న్యాయ వ్యవస్థకు ఏమైంది? ఎన్నికల కమిషన్‌కు ఏమైంది? మనం ఇక్కడ నిలబడటానికి కారణం, వెళ్లడానికి మనకు మరే ఇతర మార్గం లేకపోవడమే. మనకు మరో ప్రత్యామ్నాయం లేదు. ప్రతి సంస్థాగత మార్గం మనకు మూసుకు పోయింది.
అందుకే ఇంత విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచంలో మరెక్కడైనా ఇలా జరిగిందో లేదో నాకు తెలియదు. లోక్‌సభ, రాజ్యసభకు చెందిన మొత్తం ప్రతిపక్షం ఒక గార్డెన్ లో కూర్చొని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై అభిశంసన గురించి చర్చిస్తోంది. చాలామంది సర్, ఓటర్ల పేర్ల తొలగింపు, కొత్త ఓటర్ల చేర్పు వంటి అంశాల గురించి వివరంగా మాట్లాడారు. నేను కూడా వారి మాటలు విన్నాను. నేను ఒక్క చిన్న విషయాన్ని మాత్రమే ప్రస్తావించాలని అనుకుంటున్నాను. 13.3 కోట్ల మంది ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి. అంటే 130 మిలియన్ల మంది ప్రజలు. ప్రతి ఏడుగురు భారతీయుల్లో ఒకరి ఓటు హక్కు తొలగించబడినట్లే. భారతదేశంలోని మొత్తం ఓటర్లలో 15 శాతం మంది ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి.
గత లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఓటర్లంతా ఓటు వేశారు. ఆ ఎన్నికల్లో కేవలం 3 శాతం ఓట్ల తేడాతో విజయం నిర్ణయించబడింది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ స్వయంగా ఆ 15 శాతం మంది ఓటు వేయకూడదని చెబుతోంది. అంటే 2024 లోక్‌సభ ఎన్నికలు చట్ట విరుద్ధమైనవని, ఆ ఎన్నికల ద్వారా లోక్‌సభలోకి ప్రవేశించిన బీజేపీ సభ్యులు కూడా చట్టవిరుద్ధంగా సభలోకి వచ్చారని ఎన్నికల కమిషన్ స్వయంగా చెబుతున్నట్లే కదా అని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. మీరు 13.3 కోట్ల మంది ఓటర్ల పేర్లను తొలగించి, అదే సమయంలో 2024 ఎన్నికలు చట్ట బద్ధమైనవని ఎలా చెప్పగలరు? ఈ మొత్తం ప్రక్రియను జ్ఞానేశ్ కుమార్ పర్యవేక్షించారని ఆరోపించారు.

















