తిరుమల : తిరుమల తిరుపతి దేవస్తానం (టీటీడీ) పాలక మండలి పదవీ కాలం పూర్తి కావడంతో తాజాగా సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ సాధికారిక మండలిని ఏర్పాటు చేశారు. ఈవో ముద్దాడ రవిచంద్రకు చైర్మన్ గా బాధ్యతలు అప్పగించింది. సభ్యులుగా దేవాదాయ , ధర్మాదాయ శాఖ కమిషనర్ ను ఎంపిక చేసింది. ఈ మేరకు టీటీడీ సాధికారిక మండలి సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ సెక్రటరీ (ఎఫ్ఏసీ) కె.కన్నబాబు ప్రమాణ స్వీకారం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద జరిగిన కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయం ముందు మీడియాతో కె.కన్నబాబు మాట్లాడారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామి వారి పిలుపు, అనుగ్రహంతో తనకు ఈ గొప్ప అవకాశం లభించిందని అన్నారు. తనపై విశ్వాసం ఉంచి సాధికారిక మండలి సభ్యుడిగా నియమించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, తన శక్తిమేరకు పూర్తిస్థాయిలో సేవలందిస్తానని తెలిపారు.
సాధికారిక మండలి చైర్మన్ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయ ధార్మికత, విశిష్టతను ఖండాంతరాలకు విస్తరించేలా భక్తిశ్రద్ధలతో ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్ , బోర్డ్ సెల్ డిప్యూటీ ఈవో ప్రశాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
