హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో ఆమె సికింద్రాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా కంటోన్మెంట్ పై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కంటోన్మెంట్ నియోజకవర్గం బోయిన్ పల్లి లోని రామన్న చెరువును పరిశీలించారు. రామన్న చెరువు నిండిపోయి సమీపంలోని కాలనీలు మునుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు కవిత.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ సపరేట్ గా ఉండటంతో ఎవరు పట్టించుకునే పరిస్థితి కనిపించటం లేదని వాపోయారు. కంటోన్మెంట్ బోర్డును ప్రభుత్వం తక్షణమే జీహెచ్ఎంసీలో కలుపు కోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ చుట్టు ఉన్న 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో కలుపుకున్నారని,, దీనిని కూడా కలుపుకుంటే బాగుంటుందన్నారు కల్వకుంట్ల కవిత. కంటోన్మెంట్ విలీనం ఆగిపోయిందన్నారు. విలీనం చేస్తే జీహెచ్ఎంసీ ద్వారా నిధులు తెచ్చి కార్పొరేటర్ పనులు చేయించ గలుగుతారని స్పష్టం చేశారు. ఈ చెరువును మరమ్మతులు చేయించేందుకు తాము శాయశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పారు.
