తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి (టీటిడి) కీలక ప్రకటన చేసింది. జూలై , ఆగస్టు, సెప్టెంబర్ నెలలో శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం బ్రేక్ దర్శనం కోసం వచ్చే భక్తులకు సంబంధించి కీలక సూచనలు చేసింది. ఈవో ముద్దాడ రవిచంద్ర కీలక సూచనలు చేశారు. జూలై నెల నుండి సెప్టంబర్ 30వ తేది వరకు వివిధ పర్వదినాలు, ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాల రద్దు వివరాలు వెల్లడించారు.
జూలై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 17న ఆణివార ఆస్థానం, 19న శ్రీ ఆండవన్ ఆశ్రమ స్వామీజీకి పెద్ద మర్యాద, 29న జీయర్ స్వాముల చాతుర్మాస సంకల్పం నిర్వహిస్తుండడం వల్ల ఆయా తేదీలలో వీఐవీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 22న పవిత్రోత్సవాలకు అంకురార్పణ, 24న పవిత్రోత్సవాల రెండో రోజు సందర్భంగా పవిత్రాల సమర్పణ ఉండడం వల్ల బ్రేక్ దర్శనాలు ఉండవన్నారు. సెప్టంబర్ 8న శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం., 14న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, 15 నుండి 23వ తేది వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పై తేదిలకు సంబంధించి ముందు రోజు తిరుమలలో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించబడవు అని స్పష్టం చేశారు ఈవో రవిచంద్ర. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తిరుమల యాత్రకు ప్రణాళిక రూపొందించు కోవాల్సిందిగా కోరారు.
