శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం భారీ ఏర్పాట్లు

నిర్దేశిత సమయంలోపు పూర్తి చేయాలని ఆదేశం

hellotelugu-TTDAEO

తిరుమ‌ల : అధిక‌మాసం కార‌ణంగా తిరుమలలో ఈ ఏడాది రెండు బ్ర‌హ్మోత్స‌వాలు నిర్వ‌హిస్తున్న‌ నేపథ్యంలో ప్రణాళికలు రూపొందించి నిర్దేశిత సమయంలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్‌.వెంకయ్య చౌదరి విభాగాధిపతులను ఆదేశించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలపై తిరుమలలోని ప‌ద్మావ‌తి అతిథిగృహంలో ఉన్న సుధ‌ర్మ స‌మావేశ మందిరంలో ఆయన తిరుప‌తి జేఈవో డాక్ట‌ర్ ఏ.శ‌ర‌త్, సీవీఎస్వో మురళీకృష్ణ లతో క‌లిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టబోయే ఏర్పాట్లపై విభాగాల వారీగా సమీక్షించి పలు సూచనలు చేశారు.

ఇదిలా ఉండ‌గా శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్సాల సంద‌ర్ంగా సెప్టంబ‌ర్ 8వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉంటుంద‌ని, 14న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జ‌రుగుతుంద‌న్నారు ఏఈవో. 15న ధ్వజారోహణం, 19న గరుడ వాహనం, 22న రథోత్సవం, 23న చక్రస్నానం నిర్వ‌హిస్తామ‌న్నారు. ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని ప్రతిరోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు జ‌రుగుతాయ‌ని తెలిపారు. బ్రహ్మోత్సవ రోజుల్లో భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు.

అంతే కాకుండా వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, దాతల దర్శనాలు కూడా రద్దు చేశామ‌న్నారు ఏఈవో. విజిలెన్స్, పోలీసు విభాగాల సమన్వయంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి, రోడ్ మ్యాప్ లు, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భక్తులకు దర్శన క్యూలైన్లు, మాడ వీధుల్లోని గ్యాలరీలు, ముఖ్యమైన ప్రాంతాల్లో విరివిగా అన్న ప్రసాదాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తుల అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ పనులు చేపట్టాలని ఆదేశించారు..గ్యాలరీల్లో భక్తులకు సమస్యలు తలెత్తకుండా మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచేందుకు అదనపు సిబ్బందిని తీసుకోవాలని అన్నారు.

Exit mobile version