బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ‌లో మ‌ళ్లీ రాదు

మాజీ మంత్రి హ‌రీష్ రావుపై మ‌ల్ రెడ్డి ఫైర్

hellotelugu-MalreddyRangareddy

హైద‌రాబాద్ : ఫార్మా సిటీ ఏర్పాటుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడబోయిన బిఆర్ఎస్ ను ప్రజలు సమాధి చేసినా కూడా ఆ పార్టీ నేతలకు బుద్ధి రాలేదని… మళ్ళీ ఫార్మా తెస్తామంటూ హరీష్ రావు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా పర్యటనలో ఫ్యూచర్ సిటీ రద్దు చేసి, ఫార్మా సిటీ మళ్ళీ తెస్తామని మాట్లాడటం పట్ల ఆయన తీవ్రంగా స్పందించారు. ఫార్మా అంటేనే గత ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం ప్రజలు వారిని తరిమికొట్టి తనను 40 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారని గుర్తు చేశారు. మళ్ళీ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ రద్దు చేసి, ఫార్మా సిటీ తెస్తామని అమెరికాలో తిరుగుతూ మాట్లాడుతున్న హరీష్ రావును, ఆయన పార్టీని తెలంగాణలో ఇక ప్రజలే రద్దు చేస్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కడ చేస్తుందో అమెరికాలో ఉండి కాదు ఇక్కడికి వచ్చి చూపించాలని సూచించారు.

బిఆర్ఎస్ వచ్చేది లేదు… ప్రాణాలు తీసే ఫార్మా భయం అసలే లేదని, ప్రజలకు దీనిపై ఆందోళన అవసరం లేదన్నారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వస్థాయిలో నిలబెట్టేలా తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే విదేశాల్లో తెలంగాణకు పెట్టుబడులు రాకుండా బిఆర్ఎస్ నేతలు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి గులాబీ నేతల కళ్ళు మండుతున్నాయన్నారు. రంగారెడ్డి జిల్లాను అన్ని రకాలుగా దోపిడి చేసిన బిఆర్ఎస్ నేతలు… ఇప్పుడు ప్రగతి నిరోధకులుగా మారారని ఆరోపించారు. విష ప్రచారం చేస్తే ఈ సారి డిపాజిట్లు కూడా దక్కవని హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడు భూసేకరణకు ముందు వేల ఉద్యోగాలని మోసం చేయటమేగాక, ఇప్పుడు అధికారం పోయాక ఫార్మాతో లక్షల ఉద్యోగాలు అంటున్నారన్న మల్ రెడ్డి… బిఆర్ఎస్ ఏర్పాటే అబద్ధాల పునాదులపై ఉందని ఆరోపించారు. బిఆర్ఎస్ నేతల తీరు మారకుంటే గ్రామాల్లో తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు.

Exit mobile version