హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు చేకూర్చేలా తెలంగాణను నాశనం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్రకు తెర లేపిందంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అందుకే కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ జల పోరాటానికి సన్నద్దం అవుతోందని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కృష్ణా నదీ జలాలపై తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయంపై ప్రజా పోరాటం చేస్తాం అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తే రేవంత్ రెడ్డికి రాజకీయంగా బతుకు దెరువు ఉండదని అన్నారు. కావాలని అందుకే ప్రాజెక్టును ఆపుతున్నాడని ఆరోపించారు హరీశ్ రావు. ఈ విషయాన్ని ప్రస్తుతం క్యాబినెట్ మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణా రావే మా పార్టీలో ఉన్నప్పుడు చెప్పాడని అన్నారు.
కమీషన్ల కోసం కొడంగల్ ప్రాజెక్ట్ పేరుతో సొంత జిల్లా ప్రజలను రేవంత్ ద్రోహం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు హరీశ్ రావు. రైతులకు నీళ్లు ఇవ్వడం అనేది సీఎంకు ప్రధాన ప్రాధాన్యత కానే కాదన్నారు. వసూళ్లకు పాల్పడేందుకు ఈ ప్లాన్ చేశాడని ఆరోపించారు. ముందు నుంచి రేవంత్ రెడ్డికి వసూల్ రాజా అనే పేరు ఉందన్నారు . తమ ప్రభుత్వ హయాంలోనే సాగు నీరు రైతులకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామన్నారు హరీశ్ రావు. నీటి కేటాయింపులు లేకపోతే ఈసీ క్లియరెన్స్ రాదు, సీడబ్ల్యుసీ అనుమతులు రావు అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేవన్నారు. కేఆర్ఎంబీ బోర్డు ముందు మనం గట్టిగా కొట్లాడొచ్చని, కేసీఆర్ రాష్ట్ర సంపద నుండి రూ.27 వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టు పనులు మొదలెట్టాడని చెప్పారు.
















