హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది. మొదటి దశలో 16 నియోజకవర్గాల్లో 8,000 ఇళ్లు ఇస్తామని పేర్కొంది. ఆగస్టు 10 వరకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. త్వరలో మరో 8 నియోజకవర్గాల్లో స్థలాలు గుర్తిస్తామన్నారు. SC, ST, BC వర్గాలకు ఇళ్ల కేటాయింపులో రిజర్వేషన్లు కచ్చితంగా పాటిస్తామన్నారు. ఒక్కో ఇంటికి రూ. 11 లక్షలు ఖర్చవుతుందని, ఇందులో ప్రభుత్వ సాయంగా రూ. 5 లక్షలు సబ్సిడీ ఇస్తుందన్నారు. రూ. 40-60 లక్షల విలువైన స్థలాలను లబ్ధిదారుని పేరుతో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నామన్నారు. లబ్ధిదారుని వాటా: రూ. 6 లక్షలు ఖర్చు చేస్తే సరిపోతుందని తెలిపారు మంత్రి. అయితే ఈ సాయాన్ని నాలుగు విడతలుగా చెల్లిస్తామన్నారు.
హైదరాబాద్ ప్రాంతంలోని నగర పాలక సంస్థ పరిధిలో, మొదటి దశగా 16 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 500 చొప్పున ‘ఇందిరమ్మ ఇళ్ల’ నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. త్వరలో మరో 8 నియోజకవర్గాల్లో కూడా ఈ పథకాన్ని అమలు చేస్తామని ఆయన తెలిపారు. పేదవారికి సొంత ఇల్లు ఉండాలనే కల సాకారమయ్యే వరకు, చివరి లబ్ధిదారునికి ఇల్లు అందే వరకు ‘ఇందిరమ్మ ఇళ్ల’ కార్యక్రమం కొనసాగుతుందని, ఇది నిరంతర ప్రక్రియ అని ఆయన పేర్కొన్నారు. తోటి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్ మరియు ఇతరులతో కలిసి ఆయన ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన ఇందిరమ్మ ఇళ్ల బ్రోచర్‌తో పాటు మీ-సేవ , వాట్సాప్ దరఖాస్తు ఫారమ్‌లను ఆవిష్కరించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సృజనాత్మకంగా వివరించిన నల్గొండ జిల్లా నకిరేకల్ గ్రామానికి చెందిన కొండ నాగరాజును మంత్రులు సత్కరించి, రూ. లక్ష నగదు బహుమతిని అందజేశారు. మొదటి దశలో 4.50 లక్షల ఇళ్లను కేటాయించామని, రెండో దశలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మరో 2.50 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించామని, ఇప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష ఇళ్లను మొదలుపెట్టడం ద్వారా మొత్తం 8 లక్షల ఇళ్లను పేదలకు అందిస్తున్నామని తెలిపారు. రాబోయే నెలల్లో 2 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు.
