న్యూఢిల్లీ: బీజేపీ పూర్వ జాతీయ అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి. నడ్డాను బీజేపీ జాతీయ పార్టీ విభాగాల సహ సమన్వయకర్త విష్ణు వర్ధన్ రెడ్డి ఢిల్లీలోని నడ్డా అధికార నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.నూతనంగా బాధ్యతలు స్వీకరించిన విష్ణు వర్ధన్ రెడ్డిని ఈ సందర్భంగా జె.పి. నడ్డా అభినందించారు. రాబోయే రోజుల్లో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పార్టీ సెల్స్, ఇతర విభాగాలు చేపట్టాల్సిన కార్యక్రమాలపై పలు కీలక సూచనలు చేసినట్లు విష్ణు వర్ధన్ రెడ్డి తెలిపారు.
పార్టీ సెల్స్ ద్వారా నూతన వర్గాలను పార్టీకి ఉపయోగపడేలా అనుసంధానం చేయాలని నడ్డా సూచించినట్లు ఆయన వెల్లడించారు. రాజకీయంగా ఆసక్తి కలిగి, ప్రజా జీవితంలో చురుకుగా ఉన్న పలువురు ప్రముఖులను సెల్స్ ద్వారా పార్టీలోకి తీసుకు రావడానికి ప్రయత్నాలు చేయాలని పేర్కొన్నట్లు తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన వ్యక్తులకు పార్టీ సెల్స్‌లో అవకాశం కల్పించి, వారి ప్రతిభను పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని నడ్డా సూచించినట్లు చెప్పారు.
దేశవ్యాప్తంగా పార్టీ సెల్స్, ఇతర విభాగాలను మరింత బలోపేతం చేసి, అన్ని రాష్ట్రాల్లో విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించినట్లు విష్ణు వర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గతంలో తాను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలోని పలు విషయాలను నడ్డా గుర్తు చేసుకున్నారని విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో చెప్పారు. తనను అభినందించి, విలువైన సూచనలు, సహకారం అందించిన జె.పి. నడ్డాకు కృతజ్ఞతలు తెలిపినట్లు విష్ణు వర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నడ్డా మార్గదర్శకత్వంతో పార్టీ జాతీయ అన్ని సెల్స్ విభాగాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.
















