హైదరాబాద్ : సీనియర్ ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందారు పూనం మాలకొండయ్య. ఆమె ఇటీవల సోషల్ మీడియాలో ప్రముఖంగా మారారు. దీనికి కారణం తన పనితీరు గురించే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో తను ఎదుర్కొన్న ఇబ్బందులు , చేసిన పనుల గురించి ప్రస్తావించారు పూనం మాలకొండయ్య. 1988లో ఐఏఎస్ లో చేరారు. తన ప్రస్థానం భద్రాచలం సబ్-కలెక్టర్‌గా ప్రారంభమైంది. వరదలు , గిరిజన భూ సమస్యల వంటి క్లిష్ట పరిస్థితుల్లో కార్యాలయానికి పరిమితమై నిర్ణయాలు తీసుకోవడానికి బదులుగా ప్రజల వద్దకు నేరుగా వెళ్లి సమస్యలను పరిష్కరించే విధానానికి ఆమె ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. దీంతో తను ప్రజల కలెక్టర్ గా గుర్తింపు పొందారు . తరువాత అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా జిల్లా యంత్రాంగంలో పని చేశారు. రాష్ట్ర స్థాయిలో పౌర సరఫరాలు, పంచాయతీ రాజ్ – గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం – కుటుంబ సంక్షేమం, ఎన్‌హెచ్‌ఎం వంటి విభాగాలలో కీలక బాధ్యతలు చేపట్టారు.
మహిళా అక్షరాస్యత, సాధికారత , భద్రత అంశాలపై కూడా కృషి చేశారు పూనం మాలకొండయ్య. మహిళా భద్రతపై ఏర్పాటు చేసిన కమిటీకి నాయకత్వం వహించారు. వ్యవసాయ రంగంలోకి ప్రవేశించిన తర్వాత ఆమె సేవలకు ప్రత్యేక గుర్తింపు లభించింది. రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, గ్రామ స్థాయిలోనే అవసరమైన సేవలను అందించాలనే ఆలోచనతో ‘రైతు భరోసా కేంద్రాల’ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ సాంకేతిక సలహాలు , రైతు సంక్షేమ పథకాలు వంటి అనేక సేవలను ఒకే వేదిక ద్వారా రైతులకు అందించే విధానాన్ని ఇవి బలోపేతం చేశాయి. FAO-ICARతో వ్యవసాయ సాంకేతిక సహకార కార్యక్రమాలలో రాష్ట్రం తరపున పని చేశారు.
పశుసంవర్ధక, మత్స్య , సెరికల్చర్ (పట్టు పరిశ్రమ) రంగాలలో ఉన్నత స్థాయి బాధ్యతలు నిర్వహించారు. మత్స్య విశ్వ విద్యాలయం ఏర్పాటుకు ఆమె కృషి చేశారన్న విషయం ఆమెకు లభించిన గుర్తింపులో ప్రత్యేకంగా పేర్కొన బడింది. 2022లో ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది ఆమెకు ప్రజా సేవకు గాను ‘స్కాచ్ పబ్లిక్ సర్వీస్ అవార్డుస లభించింది. ఒకే శాఖకే పరిమితం కాకుండా ప్రజల సమస్యలు ఉన్న చోట తన పరిపాలనా అనుభవాన్ని వినియోగించారు. ప్రజా సేవకురాలిగా పేరు పొందారు.
















