Bharat Brand Taxi : సహకార రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న కొన్ని ప్రముఖ సహకార సంఘాల కన్సార్షియం దేశంలోనే తొలి సహకార ఆధారిత ట్యాక్సీ సేవను ‘‘భారత్’’ బ్రాండ్‌తో (Bharat Brand Taxi) ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ ట్యాక్సీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Bharat Brand Taxi Updates
ప్రస్తుతం ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ ట్యాక్సీ సేవలకు ప్రత్యామ్నాయంగా వస్తున్న ఈ కొత్త ప్లాట్‌ఫారమ్ ద్వారా డ్రైవర్లకు న్యాయమైన ఆదాయాన్ని అందించడంతో పాటు ప్రయాణికులకు సౌకర్యవంతమైన ధరల్లో సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ గుప్తా (Rohit Gupta) తెలిపారు.
ఈ ట్యాక్సీ సేవల కోసం ఇప్పటికే ఢిల్లీ, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ప్రాథమికంగా 200 మంది డ్రైవర్లను నియమించగా, రూ.300 కోట్ల అధీకృత మూలధనంతో సంస్థ ఏర్పాటైంది.
ఈ ప్రాజెక్టులో ఎనిమిది సహకార సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. వాటిలో జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ), ఇఫ్కో, గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్), క్రిషక్ భారతి కోఆపరేటివ్ లిమిటెడ్ (క్రిభ్‌కో), నాబార్డ్, నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్‌డీడీబీ), నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ వంటి ప్రముఖ సహకార సంస్థలు ఉన్నాయి.
ఈ ట్యాక్సీ సేవ పూర్తిగా సహకార రంగం పెట్టుబడులపై ఆధారపడుతుంది. ప్రభుత్వాన్ని ఆర్థికంగా పాల్గొనకుండా, పూర్తి స్వయం సమర్థతతో దేశవ్యాప్తంగా సేవలు విస్తరించాలన్న ఉద్దేశంతో ఇది ఏర్పాటు అవుతోంది. టెక్నాలజీ భాగస్వామిని త్వరలోనే ఎంపిక చేస్తామని, ఇతర సహకార సంఘాలతో భాగస్వామ్యాలు పెంచేందుకు చర్చలు కొనసాగుతున్నాయని రోహిత్ గుప్తా వెల్లడించారు. ఈ సేవ ప్రారంభం ద్వారా ట్యాక్సీ రంగంలో సహకార రంగం తన ప్రత్యేకమైన ముద్రను వేయనుంది.
Also Read : HCL CEO Salary Growth : భారత్ టెక్ దిగ్గజాలు అందరి కంటే ముందున్న హెచ్సిఎల్ సీఈఓ
