1.30 లక్షల కుటుంబాలకు రూ.262 కోట్లు లబ్ది

కావలిలో నిధులు విడుదల కార్యక్రమానికి సీఎం

hellotelugu-CMChandraBabu

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని మత్స్యకారుల కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోంది. వేట నిషేధ కాలంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా మత్స్యకారులను ఆదుకునేందుకు అమలు చేస్తోన్న ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద వరుసగా రెండో ఏడాది ఆర్థిక సాయం అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం మత్య్సకారుల ఖాతాల్లో జమ చేయనుంది. నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు విడుదల చేయనున్నారు. ప్రతీ ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు… 61 రోజుల పాటు సముద్రంలో చేపలు పిల్లలు పెట్టే సమయంలో వేటకు విరామం ఉంటుంది. ఈ సమయంలో మత్స్యకారుల జీవనానికి ఇబ్బంది లేకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రతీ కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది.

వేట నిషేధ సమయంలో మత్య్సకారులకు రూ.20 వేలు ఆర్థిక సాయం ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చింది. హామీ ఇచ్చినట్టుగానే గతేడాది 1,21,433 కుటుంబాలకు రూ.243 కోట్లు సాయం అందించగా ఈ ఏడాది 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సాయాన్ని ఇస్తోంది. ఈ ఏడాది లబ్ధిదారు కుటుంబాల సంఖ్య కూడా పెరిగింది. రెండేళ్లలోనే మత్య్సకారుల కుటుంబాలకు వేట నిషేధ సమయంలో రూ.505 కోట్లను సాయంగా అందించింది. గత ప్రభుత్వం మత్స్యకారులకు కేవలం రూ.10 వేల సాయాన్ని మాత్రమే అందించింది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో కూడుకున్నప్పటికీ బలహీన వర్గాల సంక్షేమానికే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ సాయాన్ని రూ.20,000 పెంచుతూ ప్రజా ప్రభుత్వం బాసటగా నిలిచింది. వరుసగా రెండో ఏడాది ఇవ్వడంతో పాటు లబ్ధిదారుల సంఖ్యను పెంచి నిధులు విడుదల చేయడం ద్వారా మత్స్యకారుల సంక్షేమంపై ప్రభుత్వ చిత్తశుద్ధి స్పష్టమవుతోంది.

Exit mobile version