త‌మిళ‌నాడులో విస్తృతంగా ఆవిన్ ఉత్ప‌త్తులు

చెన్నైలో భవ‌నాన్ని ప్రారంభించిన ముఖ్య‌మంత్రి

hellotelugu-CMVijay

చెన్నై : ఇక నుంచి త‌మిళ‌నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆవిన్ ఉత్ప‌త్తులు అందుబాటులోకి వ‌స్తాయ‌ని స్ప‌ష్టం చేశారు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. చెన్నై లో ‘ఆవిన్’ ప్రయోగశాల అనుబంధ భవనాన్ని ప్రారంభించారు. అనంత‌రం ఆవిన్ సెంట్రల్ డెయిరీ కార్యకలాపాలను పరిశీలించడంతో పాటు, పాలు సేకరించడం, ప్రాసెస్ చేయడం , పంపిణీ చేయడం వంటి వివిధ అంశాలపై సమీక్ష జరిపారు. చెన్నైలోని మాధవరం డైరీ కాంప్లెక్స్‌లో రూ. 2.23 కోట్ల వ్యయంతో నిర్మించారు ఆవిన్ సెంట్రల్ లాబొరేటరీ అదనపు భవనాన్ని. ఈ పర్యటనలో చెన్నైలోని వివిధ ప్రాంతాలకు ప్యాక్ చేసిన పాలను సరఫరా చేయడానికి చేసిన ఏర్పాట్ల గురించి ఆయన అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మాధవరం కాంప్లెక్స్‌లో నిర్మితమవుతున్న కొత్త డైరీ కేంద్రం పనులను కూడా ఆయన పరిశీలించారు. ఆవిన్ పాలు తగినంతగా అందుబాటులో లేక పోవడం వల్ల వినియోగదారులు తమ రోజువారీ అవసరాలకు సరిపడా పాలను పొందడంలో ఇబ్బందులు పడుతున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈ పర్యటన జరిగింది.

రిటైల్ దుకాణాల్లో నిల్వలు త్వరగా అమ్ముడై పోతుండటంతో కొందరు స్థానికులు అధిక ధర కలిగిన ప్రైవేట్ బ్రాండ్ల పాలను కొనాల్సి వస్తోంది. సమాచారం ప్రకారం, మాధవరం కేంద్రం రోజుకు 4 లక్షల నుండి 4.5 లక్షల లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తోంది. 45కు పైగా పంపిణీ మార్గాల ద్వారా ఈ కేంద్రం నుండి ప్యాక్ చేసిన పాలు నగరంలోని వివిధ ప్రాంతాలకు ట్రక్కుల ద్వారా తరలించ బడతాయి. విస్తృతమైన పంపిణీ వ్యవస్థ ఉన్నప్పటికీ, స్థానిక దుకాణాల్లో కొరత ఉన్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. లభ్యతపై నెలకొన్న అనిశ్చితి ఆవిన్ పాలపై ఆధారపడే కుటుంబాలపై ప్రభావం చూపింది. తనిఖీ సమయంలో ముఖ్యమంత్రి డెయిరీ సేకరణ , పంపిణీ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ఈ కేంద్రంలో పాలను నిర్వహించడం , చెన్నై అంతటా ఉన్న విక్రయ కేంద్రాలకు రవాణా చేయడం వంటి కార్యకలాపాల గురించి సమీక్షించారు.

Exit mobile version