హైదరాబాద్ : గత కొంత కాలంగా తమ సమస్యలపై ఉద్యమిస్తున్న ఉద్యోగులకు ఖుష్ కబర్ చెప్పింది తెలంగాణ సర్కార్. కేబినెట్ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ మేరకు రెండు డీఏలు ఇవ్వాలని కోరుతూ ఆమోదం తెలిపింది. దసరా పండుగ వేళ ఈ మేరకు వచ్చే నెల నవంబర్ 1వ తేదీ నుండి రెండు డీఏలు దశల వారీగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించింది . 2015 వేతన శ్రేణి పరిధిలోని ఉద్యోగులకు డీఏను 73.344 శాతం నుండి 78.06 శాతానికి , జూలై 2024 నుండి 81.728 శాతానికి) పెంచారు.ఇటీవల తీసుకున్న మంత్రివర్గ నిర్ణయం మేరకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న రెండు విడతల కరువు భత్యం, పెన్షనర్లకు కరువు ఉపశమన భత్యం మంజూరు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం పెంచిన డీఏను అక్టోబర్ 2026 జీతంతో కలిపి నవంబర్ 1న చెల్లిస్తారు.
జనవరి 2024 నుండి సెప్టెంబర్ 2026 వరకు ఉన్న కాలానికి సంబంధించిన డీఏ బకాయిలను ప్రభుత్వం 33 విడతలుగా చెల్లిస్తుంది. అదేవిధంగా జూలై 2024 నుండి సెప్టెంబర్ 2026 వరకు ఉన్న కాలానికి సంబంధించిన డీఏ బకాయిలను 27 విడతలుగా చెల్లిస్తారు. డీ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జనవరి 2024 నుండి డీఏను 33.67 శాతం నుండి 37.31 శాతానికి పెంచినట్లు, అలాగే జూలై 2024 నుండి దీనిని 37.31 శాతం నుండి 40.04 శాతానికి మరింత పెంచాలని నిర్ణయించినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. అదనంగా, 2015 వేతన శ్రేణి పరిధిలోని ఉద్యోగులకు డీఏను 73.344 శాతం నుండి 78.06 శాతానికి జూలై 2024 నుండి 81.728 శాతానికి పెంచారు. 2020 వేతన శ్రేణి పరిధిలోని ఉద్యోగులకు కరువు భత్యం 37.31 శాతం నుండి 40.04 శాతానికి పెరగనుంది. యుజిసీ, ఏఐసీటీఈ వేతన శ్రేణుల పరిధిలోని ఉద్యోగులకు కూడా డీఏను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2016 వేతన శ్రేణి ఉద్యోగులకు డీఏ 46 శాతం నుండి 50 శాతానికి, అలాగే జూలై 2024 నుండి 53 శాతానికి పెరిగింది.
